లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:47 PM
మండలంలోని బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని, నర్సీపట్నం నుంచి విశాఖప్నటం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు.
నర్సీపట్నం నుంచి విశాఖ వెళుతుండగా బయ్యవరం వద్ద ప్రమాదం
తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్
ఎనిమిది మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలు
కశింకోట, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని, నర్సీపట్నం నుంచి విశాఖప్నటం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ అల్లు స్వామినాయుడు తెలిపిన వివరాలిలా వున్నాయి.
నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్లే నాన్‌స్టాప్ బస్సు సోమవారం ఉదయం 8.40 గంటలకు నర్సీపట్నంలో బయలుదేరింది. 9.20 గంటలకు మండలంలోని బయ్యవరం వద్దకు వచ్చే సరికి డివైడర్ వైపు లారీ వెళుతుండగా, దాని వెనుక వున్న ఆర్టీసీ బస్సు ఎడమవైపున వెళుతున్నది. అయితే డీజిల్ బంకులోకి వెళ్లేందుకు లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా ఆకస్మికంగా ఎడమ వైపునకు తిప్పాడు. దీంతో వెనుక వస్తున్న బస్సు ముందు భాగం, లారీని బలంగా ఢీకొన్నది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతోపాటు డ్రైవర్ కె.కె.కుమార్ ఇరుక్కుపోయాడు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కొప్పిశెట్టి సత్యనారాయణ, గెడ్డం పద్మ, నమ్మి రాజ్‌కుమార్, పసుపులేటి ప్రభాకర్, మాకిరెడ్డి రామలక్ష్మి, కె.కల్యాణ్‌కుమార్, పి.గంగాధర్, మాకిరెడ్డి నారాయణమూర్తి స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సు శకలాల మధ్య చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. సీఐ అల్లు స్వామినాయుడును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన కారణంగా ఎలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళ్లే మార్గంలో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. బస్సులో ప్రయాణిస్తున్న నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన మాకిరెడ్డి నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.