Share News

ఎకరాకు రూ.9 లక్షలు?

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:50 AM

మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ కొండపోరంబోకు భూముల సాగుదారులకు ఎకరాకు రూ.9 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో రైతులతో నిర్వహించే గ్రామసభలో అధికారంగా వెల్లడించనున్నట్టు తెలిసింది.

ఎకరాకు రూ.9 లక్షలు?
రైతుల సాగులో ఉన్న కొండపోరంబోకు భూమి

రాచపల్లి సాగుదారులకు నష్టపరిహారం

కలెక్టర్‌కు చేరిన రైతుల జాబితా

రెండు, మూడు రోజుల్లో గ్రామసభ

అనంతరం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

మాకవరపాలెం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ కొండపోరంబోకు భూముల సాగుదారులకు ఎకరాకు రూ.9 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో రైతులతో నిర్వహించే గ్రామసభలో అధికారంగా వెల్లడించనున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా శుక్రవారం సాగుదారులైన రైతుల జాబితాను జిల్లా కలెక్టర్‌కు అందజేసినట్టు సమాచారం. రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో వున్న కొండపోరంబోకు భూముల్లో చాలా కాలం నుంచి రైతులు మామిడి, జీడిమామిడి తోటలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ అయిన్న అయ్యన్నపాత్రుడు కృషితో కూటమి ప్రభుత్వం రాచపల్లి ప్రాంతాన్ని పారిశ్రామిక్‌ హబ్‌కు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సుమారు 410 ఎకరాలను 469 మంది చిన్న, సన్నకారు రైతులు సాగుచేసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఎకరా రూ.18 లక్షలు వుంది. సాగుదారులైన రైతులకు పట్టాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ విలువలో 50 శాతం సొమ్మును పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ఎకరాకు రూ.9 లక్షల చొప్పున పరిహారం అందే అవకాశం వుంది. ఇదే విషయాన్ని ఇటీవల స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. రెవెన్యూ అధికారులు వారం రోజుల్లో గ్రామసభ నిర్వహించి సాగుదారుల జాబితాను ప్రకటిస్తారు. తరువాత ఆయా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతుల జాబితాలను శుక్రవారం కలెక్టర్‌కు అందజేసినట్టు సమాచారం.

Updated Date - Nov 22 , 2025 | 12:50 AM