పేదల ఇళ్ల కాలనీల్లో తాగునీటికి రూ.640 కోట్లు
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:18 AM
నగర శివారు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 73 ఇళ్ల కాలనీల్లో తాగునీటి కల్పనకు రూ.640 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్టు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
పంచ గ్రామాల భూ సమస్యకు సాధ్యమైనంత వేగంగా పరిష్కారం
ప్రత్యామ్నాయంగా దేవస్థానానికి గాజువాకలో భూములు
కోర్టులో అఫిడవిట్ దాఖలు
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు చర్యలు
లక్ష్యం మేరకు వృద్ధి రేటు
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
పోలీస్ కమిషనర్‌కు సీఎం అభినందన
విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
నగర శివారు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 73 ఇళ్ల కాలనీల్లో తాగునీటి కల్పనకు రూ.640 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్టు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజు మంగళవారం విశాఖ జిల్లాకు సంబంధించి కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల కాలనీల్లో నీటి సదుపాయం, పంచ గ్రామాల భూ సమస్య, ఆక్రమణల క్రమబద్ధీకరణ, ఆర్థిక వృద్ధి రేటు, తదితర అంశాలను సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్ల కాలనీలకు బయట నుంచి పైప్‌లైన్‌ల ద్వారా నీటిని తీసుకురావాల్సి ఉందని పేర్కొంటూ అందుకు రూ.640 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. నగర పరిధిలోని లేఅవుట్‌లకు అమృత్, గ్రామీణ ప్రాంత లేఅవుట్‌లకు జలజీవన్ మిషన్ పథకం అమలు చేయాలన్నారు. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పంచ గ్రామాల సమస్యను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. పంచ గ్రామాల్లో సుమారు 12,190 ఆక్రమణలు ఉన్నాయన్నారు. ఆక్రమణదారులు ఉన్న భూమికి సమాన విలువ కలిగిన భూములను గాజువాక మండలంలో గుర్తించినట్టు కలెక్టర్ వెల్లడించారు.
నగరంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవోలు 35, 40 ప్రకారం వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్రమణలను త్వరితగతిన రెగ్యులర్ చేసేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా గడచిన మూడు నెలల్లో జిల్లా అభివృద్ధి రేటు సాధించామని, రానున్న కాలంలో అదే వృద్ధి సాధిస్తామన్నారు. సర్వీస్ సెక్టార్‌లో జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. వస్తువుల ఉత్పత్తిలో బెంచ్ మార్కుకు చేరుకున్నామని, పారిశ్రామిక వృద్ధి రేటు 10 శాతం లక్ష్యం కాగా ఇప్పటికే 9.97 శాతం సాధించామని కలెక్టర్ తెలిపారు.
పోలీస్ కమిషనర్‌కు సీఎం అభినందన
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న హత్య కేసులను ఛేదించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీని సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. అమరావతిలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ నగరంలో తమ విభాగం పనితీరు గురించి వివరించారు. మూడేళ్ల కిందట కంచరపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన స్ర్కాప్ వ్యాపారి హత్య కేసును ఇటీవల తాము ఛేదించినట్టు చెప్పారు. అలాగే ఎయిర్‌పోర్టు స్టేషన్ పరిధిలో మహిళ మిస్సింగ్ కేసు మూడేళ్ల పాటు పెండింగ్‌లో ఉండిపోయిందని, తాను ప్రత్యేక చొరవ తీసుకొని కేసు దర్యాప్తు చేయగా ఆమెను కొందరు హత్య చేసినట్టు తేలిందన్నారు. ఆ కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ పంపించామని వివరించారు. దీంతో సీఎం స్పందిస్తూ పెండింగ్ కేసుల దర్యాప్తులో విశాఖ పోలీస్ కమిషనర్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాల్లో పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం నగరం మహిళలకు సురక్షిత నగరంగా గుర్తింపు పొందడం పట్ల సీపీని సీఎం అభినందించారు.