మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.6,100 కోట్ల ప్రైవేటు రుణం
ABN , Publish Date - May 15 , 2025 | 01:02 AM
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు గత పదేళ్ల నుంచి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి పడుతోంది. 2014 నుంచే ఈ ప్రాజెక్టుపై కసరత్తులు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20 శాతం వ్యయం భరించి, మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సేకరించాలని అప్పట్లో అనుకున్నారు.
మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిందే..
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు గత పదేళ్ల నుంచి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి పడుతోంది. 2014 నుంచే ఈ ప్రాజెక్టుపై కసరత్తులు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20 శాతం వ్యయం భరించి, మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సేకరించాలని అప్పట్లో అనుకున్నారు. రాష్ట్ట్ర విభజన తరువాత రెండు ప్రభుత్వాలు మారి ఇప్పుడు మూడోది అధికారంలోకి రావడంతో ప్రణాళికలు కూడా దానికి తగ్గట్టుగా మారిపోయాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన 2014-19 కాలంలోనే ఈ ప్రాజెక్టుకు సాయం చేయడానికి ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ముందుకు వచ్చింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును మార్చేసి చివరకు డీపీఆర్‌ను కూడా సమర్పించకుండానే కాలం గడిపేసింది. ఇప్పుడు మళ్లీ సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రంతో ఉన్న అనుబంధంతో ఈ ప్రాజెక్టుకు వంద శాతం నిధులు సాధిస్తామని ప్రకటించడంతో పాటు ఆ దిశగా కొత్త ప్రణాళికలను రూపొందించారు. మూడు కారిడార్లతో 46.23 కి.మీ. పొడవున నిర్మించే ఈ ప్రాజెక్టుకు నిర్మాణ వ్యయం రూ.11,498 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించారు. దీనికి 99.8 ఎకరాల భూమి అవసరం అవుతుందని, ప్రైవేటు భూములకు చెల్లించడానికి రూ.882 కోట్లు కావాల్సి ఉంటుందని లెక్కలు వేశారు. ఢిల్లీ వెళ్లినపుడల్లా దీనిపై చర్చలు జరిపారు. అక్కడ ఏమైందో తెలియదు గానీ తాజాగా మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి బుధవారం అమరావతిలో ప్రైవేటు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి విశాఖతో పాటు అమరావతి మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు తక్కువ వడ్డీతో రుణ సాయం చేయాలని కోరారు. విశాఖ ప్రాజెక్ట్‌కు రూ.6,100 కోట్లు రుణంగా అవసరం అవుతుందని ప్రతిపాదించారు. ఈ సమావేశానికి ఏడీబీతో పాటు ఇంకా అనేక బ్యాంకులు హాజరయ్యాయి. పీపీపీ విధానంలో ప్రైవేటు బ్యాంకులు రూ.6,100 కోట్లు సమకూరిస్తే మిగిలిన మొత్తం రూ.5,398 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇది కాకుండా భూ సేకరణకు అవసరమైన మొత్తం రూ.882 కోట్లు ఏపీ ప్రభుత్వం సమకూర్చుకోవాలి. అప్పుడే ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వస్తుంది.