రబీ సీజన్‌లో రూ.340 కోట్ల రుణాలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:28 AM
వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్‌లో రైతులకు రూ.340 కోట్లు పంట రుణాలుగా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకూ రూ.272 కోట్లు అందజేశామన్నారు. ఆయన గురువారం తన ఛాంబర్‌లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో గల 98 సొసైటీల పరిధిలో 4.56 లక్షల మంది రైతులు ఉన్నారని, పంట రుణం కింద ఒక రైతుకు రూ.మూడు లక్షల వరకూ మంజూరుచేస్తామన్నారు.
‘ఆంధ్రజ్యోతి’తో డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు
ఖరీఫ్‌లో ఇప్పటివరకూ రూ.272 కోట్లు
క్రాప్ లోన్ ఒక్కొక్కరికీ రూ.3 లక్షలు, 4 శాతం వడ్డీ
సకాలంలో రుణం చెల్లిస్తే వడ్డీ మాఫీ
సొంత అవసరాలకు రూ.ఆరు లక్షల వరకూ రుణం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.మూడు వేల కోట్ల వ్యాపార లక్ష్యం
స్వయంశక్తి సంఘాలకు కూడా రుణాలు
విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్‌లో రైతులకు రూ.340 కోట్లు పంట రుణాలుగా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకూ రూ.272 కోట్లు అందజేశామన్నారు. ఆయన గురువారం తన ఛాంబర్‌లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో గల 98 సొసైటీల పరిధిలో 4.56 లక్షల మంది రైతులు ఉన్నారని, పంట రుణం కింద ఒక రైతుకు రూ.మూడు లక్షల వరకూ మంజూరుచేస్తామన్నారు.
రుణాల మంజూరుకు గత ప్రభుత్వంలో ఉన్న షరతులు ప్రస్తుతం సడలించినట్టు తాతారావు తెలిపారు. రైతులు ఏ పంట సాగు చేసినా రుణాలు మంజూరుచేస్తున్నామన్నారు. ఏజెన్సీలో పసుపు, కాఫీ, చింత, ఇతర ఉద్యానవన పంటలకు రుణాలు ఇస్తున్నామని వివరించారు. పాయకరావుపేట ప్రాంతంలో తమలపాకు సాగుచేసే రైతులకు ఎకరాకు రూ.లక్ష రుణం అందజేస్తున్నామని వెల్లడించారు. కేవలం నాలుగు శాతం వడ్డీతో ఇచ్చే పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం వడ్డీ మాఫీ చేస్తున్నాయని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయం, సొంత అవసరాల కోసం ఇచ్చే స్వల్పకాలిక రుణాల పరిమితి రూ.ఐదు లక్షల నుంచి రూ.ఆరు లక్షలకు పెంచామన్నారు. దీనిని రూ.10 లక్షలకు పెంచాలని ప్రతిపాదించామని తాతారావు చెప్పారు.
బ్యాంకు వ్యాపార అభివృద్ధిలో భాగంగా బంగారంపై ఇచ్చే రుణాలకు ఆదరణ లభిస్తున్నదన్నారు. తొమ్మిది శాతం వడ్డీకి గ్రాము బంగారంపై రూ.6,500 రుణం మంజూరుచేస్తున్నామన్నారు. బ్యాంకు బ్రాంచిలతోపాటు దాదాపు పది సొసైటీలు బంగారంపై రుణాలు మంజూరుచేస్తున్నాయన్నారు. సొసైటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.కోటి మంజూరుచేశామని తాతారావు తెలిపారు. జిల్లాలో సొసైటీలకు సొంత భవనాలు లేని గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలు కేటాయించాలని కలెక్టర్లను కోరామన్నారు. రైతు సేవా కేంద్రాలు లేనిచోట సొంత భవనాలు నిర్మించేందుకు డీసీసీబీ సాయం చేస్తుందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.మూడు వేల కోట్ల వ్యాపార లక్ష్యం కాగా ఇంతవరకూ రూ.2,700 కోట్లు చేశామన్నారు. స్వయంశక్తి సంఘాలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువకు అంటే ఏడు శాతం వడ్డీకి డీసీసీబీ రుణాలు అందజేస్తోందన్నారు. ఇంకా రుణానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు రూ.4,000 చెల్లించనవసరం లేదన్నారు. అలాగే ఇళ్ల రుణాల పరిమితి పెంచామని, నిర్మాణ వ్యాపారాలకు రుణాలు ఇస్తామన్నారు. రైతులకు ప్రమాద బీమా మొత్తాన్ని పెంచాలనే ప్రతిపాదన బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. ప్రస్తుతం ప్రమాదవశాత్తూ రైతు మరణిస్తే రూ.రెండు లక్షలు, సహజ మరణానికి 58 ఏళ్లు కంటే తక్కువ ఉంటే రూ.30 వేలు, పైబడితే రూ.15 వేలు సాయం ఇస్తున్నామన్నారు. అయితే ఏళ్ల తరబడి సొసైటీతో కలిసి ప్రయాణించే రైతు మరణిస్తే తగిన సాయం అందించాలన్న యోచనతో రైతు, సొసైటీ, బ్యాంకు, ఆప్కాబ్ కలిసి ప్రీమియం చెల్లించేలా ఒక ప్రతిపాదన రూపొందించామని తాతారావు చెప్పారు.