ఆర్‌ఈసీఎస్ ఉద్యోగుల జీతాల పెంపునకు రూ.3 కోట్ల డీల్!?
ABN , Publish Date - May 07 , 2025 | 12:57 AM
అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సరఫరా సంస్థ (ఆర్‌ఈసీఎస్) ఉద్యోగులకు పే రివిజన్ కమిషన్-2022 జీతాలు వర్తింపజేయడానికి మూడు కోట్ల రూపాయలకు డీల్ కుదిరిందని విశ్వసనీయ సమాచారం.
సంస్థపై నెలకు రూ.50 లక్షల భారం
బకాయిలు చెల్లిస్తే అదనంగా మరో రూ.20 కోట్లు
సహకార శాఖ కమిషనర్ ఆమోదం లేకుండా పీఆర్‌సీ వర్తింపజేయాలని నిర్ణయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సరఫరా సంస్థ (ఆర్‌ఈసీఎస్) ఉద్యోగులకు పే రివిజన్ కమిషన్-2022 జీతాలు వర్తింపజేయడానికి మూడు కోట్ల రూపాయలకు డీల్ కుదిరిందని విశ్వసనీయ సమాచారం. ఇందులో స్థానిక నాయకులు వారి వాటా తీసుకొని, మిగిలిన మొత్తం జిల్లా, ఈపీడీసీఎల్ అధికారులకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని చెబుతున్నారు. ఈ నిర్ణయం అమలు చేయడం వల్ల అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌పై నెలకు రూ.50 లక్షల భారం పడుతుంది. 2022 నుంచి పెరిగిన జీతాల బకాయిలు ఇస్తే మరో రూ.20 కోట్లు ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమకు పెరిగిన ఆరు నెలల జీతం వదులుకోవడానికి సిద్ధపడి ఈ ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.
ఆర్‌ఈసీఎస్‌లో ఉద్యోగుల నియామకానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించడం లేదు. రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి చెందిన వారిని ఉద్యోగులుగా తీసుకుంటున్నారు. ఈపీడీసీఎల్ విద్యుత్‌ను యూనిట్ రూ.1.50 చొప్పున సరఫరా చేస్తోంది. దానిని సొసైటీ ఐదు రూపాయల చొప్పున అమ్మి ఆ లాభాలను సొసైటీ ఖాతాలో వేసి, జీతాలు, ఖర్చులు కింద చూపించి లాభపడుతోంది. ఇలా కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. వీరు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం కూడా ఈ సొసైటీల కొనసాగింపునకు రెన్యువల్ చేయకుండా ఆపేసింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి సొసైటీని ఈపీడీసీఎల్‌కు అప్పగించారు.
సొసైటీలో శాశ్వత ఉద్యోగులు 120 మంది, కాంట్రాక్టు పే వర్కర్లు (తాత్కాలికం) 492 మంది ఉన్నారు. అవసరాలకు మించి ఉద్యోగులను నియమించారని విద్యుత్ నియంత్రణ మండలి ఇంతకు ముందే గుర్తించింది. ఇప్పుడు ఈపీడీసీఎల్ అధికారులు 120 మందికే పీఆర్‌సీ అమలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పీఆర్‌సీ వర్తిస్తుంది. సొసైటీకి వర్తించదు. ఆ ఉద్యోగులను ఈపీడీసీఎల్ విలీనం కూడా చేసుకోలేదు. అయినా అనకాపల్లి జిల్లా ఎస్‌ఈ సిఫారసు చేశారని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం పెరిగిన జీతాలు ఇచ్చేసింది. ఇక్కడ అత్యంత కీలకమైన అధికారి ఒకరు ఉన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్. ఆమె ఆర్‌ఈసీఎస్‌కు పర్సన్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. సొసైటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆమె ఆమోదించాలి. అలాగే ఎస్‌ఈ ఇన్‌చార్జి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతంలో ఎండీ అక్రమాలకు పాల్పడినందునే ఆయన్ను సస్పెండ్ చేశారు. గతంలో సొసైటీ పాలకమండలి పీఆర్‌సీకి ఏ విధంగా తీర్మానం చేసేదో అలాగే తామూ చేసి జీతాలు పెంచామని ఆ జిల్లా అధికారులు చెబుతున్నారు. పాలక మండలి ఇప్పుడు లేదు. ఇవి ఆర్థిక వ్యవహారాలు. ప్రభుత్వ ఆమోదం ఉండాలి. ఒకవేళ పీఆర్‌సీ ఇవ్వాలనుకుంటే సహకార శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాలి. అక్కడి నుంచి వచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 62 ఏళ్లకు పెంచడం కుదరదని కమిషనర్ చెబితే అంతా మిన్నకున్నారు. ఇప్పుడు కూడా అలాగే కమిషనర్ నిర్ణయం కోరాల్సి ఉంది. కానీ అటువంటిదేమీ లేకుండానే రాజకీయ ఒతిళ్లకు లొంగి పీఆర్‌సీ వర్తింపజేసేశారు. దీనిపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.