తీరం కోత నివారణకు రూ.222.22 కోట్లు
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:33 AM
జిల్లాలో సముద్ర తీరం కోతకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన నిర్మాణాల కోసం కేంద్రం రూ.222.22 కోట్లు విడుదల చేసింది. నగరంలో కురుసుర సబ్‌మెరైన్, నోవాటెల్ హోటల్ ఎదురుగా గల గోకుల్ పార్కు, మంగమారిపేట, భీమిలి తదితర ప్రాంతాల్లో తీరం భారీగా కోతకు గురవుతోంది. కోత నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునే అవకాశం ఉందని వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీలు కలిసి ఒక ప్రణాళిక రూపొందించాయి.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గ్రీన్‌సిగ్నల్
90 శాతం కేంద్రం విడుదల
ఆర్కే బీచ్ సహా పలుచోట్ల కోత నియంత్రణకు చర్యలు
విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో సముద్ర తీరం కోతకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన నిర్మాణాల కోసం కేంద్రం రూ.222.22 కోట్లు విడుదల చేసింది. నగరంలో కురుసుర సబ్‌మెరైన్, నోవాటెల్ హోటల్ ఎదురుగా గల గోకుల్ పార్కు, మంగమారిపేట, భీమిలి తదితర ప్రాంతాల్లో తీరం భారీగా కోతకు గురవుతోంది. కోత నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునే అవకాశం ఉందని వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీలు కలిసి ఒక ప్రణాళిక రూపొందించాయి. ఇదే పథకం కింద కాకినాడ జిల్లాలోని ఉప్పాడ బీచ్ పరిరక్షణకు నిధులు వచ్చాయని, అదేవిధంగా విశాఖకు కూడా వచ్చే అవకాశం ఉందని కమిషనర్లు...ఎంపీ శ్రీభరత్‌కు వివరించడంతో ఆయన ఢిల్లీలో పెద్దలతో మాట్లాడారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సముద్ర తీరాన్ని రక్షించుకోవలసి ఉందని చెప్పడంతో ‘అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రోగ్రామ్-ఫేజ్ 2 కింద రూ.222.22 కోట్లు ఇవ్వడానికి అంగీకరిస్తూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధుల్లో 90 శాతం అంటే రూ.200 కోట్లు కేంద్రం ఇస్తుంది. మిగిలిన పది శాతం అంటే రూ.22.22 కోట్లు రాష్ట్రం ఇస్తుంది. అనేక ప్రయత్నాల మీదట నిధులు విడుదల కావడంతో వాటిని సద్వినియోగం చేస్తామని ఎంపీ శ్రీభరత్ తెలిపారు.
ఈ నిధులతో పెదజాలరిపేట, మంగమారిపేట, భీమిలి ప్రాంతాల్లో సముద్రపు గోడలు నిర్మిస్తారు. అదేవిధంగా ఆర్‌కే బీచ్‌లో రిటెన్షన్ గోడ నిర్మిస్తారు. గోకుల్ పార్క్ వద్ద గ్రోయిన్ నిర్మిస్తారు. రుషికొండ, చేపలుప్పాడ, తదితర ప్రాంతాల్లో ఇసుక మేటలు పునరుద్ధరిస్తారు. ఇవన్నీ కేంద్రానికి ప్రతిపాదించిన వాటిలో ఉన్నాయి.