కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.21.18 కోట్లు మంజూరు
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:24 AM
స్థానిక జిల్లా కోర్టుతో సహా నాలుగు కోర్టుల భవన సముదాయాల నిర్మాణాలకు రూ.21 కోట్ల 18 లక్షలు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది.
జీవో విడుదల చేసిన ప్రభుత్వం
జిల్లా కోర్టు సహా నాలుగు కోర్టుల భవనాలకు నిధులు
అన్ని హంగులతో త్వరగా నిర్మాణాలు పూర్తి చేస్తాం
ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
చోడవరం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా కోర్టుతో సహా నాలుగు కోర్టుల భవన సముదాయాల నిర్మాణాలకు రూ.21 కోట్ల 18 లక్షలు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మరో మూడు కోర్టులు ప్రస్తుతం శిథిల ప్రాంగణంలో నడుస్తున్నాయి. ఈ కోర్టు భవనాల నిర్మాణాలకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రూ.19.54 కోట్లు విడుదలైనప్పటికీ, వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కోర్టు భవనాల నిర్మాణాలను పట్టించుకోలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోర్టు భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థానిక న్యాయవాదుల వినతి మేరకు ఎమ్మెల్యే రాజు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గతంలో మంజూరు చేసిన నిధులకు అదనంగా మరో రూ 2 కోట్లు కలిపి మొత్తం రూ.21 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు భవనాలు త్వరితగతిన పూర్తి చేస్తాం
జిల్లా కోర్టుతో సహా నాలుగు కోర్టులకు శాశ్వత భవన నిర్మాణాలకు ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని సోమవారం రాత్రి బార్ అసోసియేషన్ న్యాయవాదులకు స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో కోర్టు కాంప్లెక్స్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అలాగే 150 సంవత్సరాల క్రితం రాతితో కట్టిన పురాతన భవనాలు దెబ్బతినకుండా, ఆ భవనాన్ని పరిరక్షించే దిశగా కూడా ప్రణాళిక అమలు చేయనున్నట్టు తెలిపారు. కాగా కోర్టు సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 21 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడానికి కృషి చేసిన ఎమ్మెల్యే రాజును బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కామిరెడ్డి వెంకటరావు, టీడీపీ స్టేట్ లీగల్‌సెల్ కార్యదర్శి గూనూరు లక్ష్మినారాయణ, చీపురుపల్లి సూర్యనారాయణ, పి.శ్రీనివాసరావు, గొర్లె కృష్ణవేణి, వేసలపు వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.