‘నర్సీపట్నం’ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:29 AM
నర్సీపట్నం నియోజకవర్గంలో ఏటా రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్టు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
తాండవ-నాతవరం రోడ్డుకు రూ.3.5 కోట్లు మంజూరు
శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నాతవరం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):
నర్సీపట్నం నియోజకవర్గంలో ఏటా రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్టు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మండలంలోని డి.యర్రవరంలో రూ.2 కోట్లతో నిర్మించిన బాలికల వసతిగృహాన్ని, రూ.23 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని సోమవారం అధికారులతో కలసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. తాండవ-నాతవరం రోడ్డుకు రూ.3.5 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.4 వేలకు తగ్గకుండా పింఛన్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. నాతవరం-గొలుగొండ మండలాలను కలిపే రోడ్డుకు తాండవ డ్యామ్ వద్ద రక్షణగోడ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తున్నదని, పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. అంతకుముందు గ్రామంలో పలువురి ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, టీడీపీ నాయకులు నందిపల్లి వెంకటరమణ, ఎన్.విజయ్‌కుమార్, వెలగా వెంకటకృష్టారావు, ఇనపసప్పల సత్యవతి, చింతంరెడ్డి బెన్నయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు.