Share News

కొండలా రాయల్టీ బకాయిలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:37 AM

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. క్వారీల నిర్వాహకులు హవా సాగిస్తున్నారు. కొండలను తొలుస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి రాయల్టీ మాత్రం సరిగా చెల్లించడంలేదు. జిల్లాలో రోడ్డు మెటల్‌, కంకర క్వారీల నిర్వాహకులు సుమారు రూ.300 కోట్ల మేర ప్రభుత్వానికి రాయల్టీ, జరిమానాల రూపంలో బకాయి పడ్డారు.

కొండలా రాయల్టీ బకాయిలు
మార్టూరులో గతంలో జరిమానా విధించిన రాయి క్వారీ

ఏళ్ల తరబడి చెల్లించని క్వారీల నిర్వాహకులు

యథావిధిగా రాయి తవ్వకాలు

ప్రభుత్వ ఆదాయానికి గండి

జిల్లాలో పేరుకుపోయిన రాయల్టీ, పన్ను బకాయిలు రూ.300 కోట్లు

వసూలుకు చర్యలు చేపట్టని ప్రభుత్వం

క్వారీల నిర్వాహకులతో కూటమి నేతలు లోపాయికారి ఒప్పందం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. క్వారీల నిర్వాహకులు హవా సాగిస్తున్నారు. కొండలను తొలుస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి రాయల్టీ మాత్రం సరిగా చెల్లించడంలేదు. జిల్లాలో రోడ్డు మెటల్‌, కంకర క్వారీల నిర్వాహకులు సుమారు రూ.300 కోట్ల మేర ప్రభుత్వానికి రాయల్టీ, జరిమానాల రూపంలో బకాయి పడ్డారు.

జిల్లాలో అత్యధిక రాయి క్వారీలు అనకాపల్లి మండలంలో ఉన్నాయి. రాయి తవ్వకాలకు అనుమతి పొందిన వ్యక్తులు, సంస్థలు నిర్ణీత మొత్తాన్ని రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే రాయి క్వారీల నిర్వాహకులు కొన్నేళ్లుగా రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరిధిలోని రాయి క్వారీల్లో 2020-21 సంవత్సరంలో అప్పటి గనుల శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ ఏడీ ప్రతాపరెడ్డి విస్తృత తనిఖీలు చేపట్టారు. మార్టూరు, మామిడిపాలెం, మాకవరం, కుంచంగి, కూండ్రం, వేటజంగాలపాలెం పరిసరాల్లో పలు క్వారీలతోపాటు స్టోన్‌ క్రషర్లలో తనిఖీలు నిర్వహించి కొలతలు తీయించారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీలు, స్టోన్‌ క్రషర్ల నిర్వాహకులకు సుమారు రూ.300 కోట్లకు పైచిలుకు రాయల్టీ, జరిమానాలు విధిస్తూ నోటీసులు జారీ చేశారు. కానీ ఎవరూ జరిమానాలు చెల్లించలేదు. నాడు అధికారంలో వున్న వైసీపీ పెద్దలను ఆశ్రయించడంతో రాయల్టీ, జరిమానాల చెల్లింపులు అటకెక్కాయి. కొన్ని క్వారీల నిర్వాహకులు మాత్రం మొక్కుబడిగా కొద్ది మొత్తాన్ని చెల్లించి యథావిధిగా మైనింగ్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు అనకాపల్లి మండలం మార్టూరులో ఒక ప్రముఖ కంపెనీకి అప్పట్లో రూ.11 కోట్లకు పైగా రాయల్టీ చెల్లించాలని నోటీసులు జారీ చేయగా రూ.25 లక్షలు మాత్రమే చెల్లించినట్లు తెలిసింది. నర్సీపట్నం డివిజన్‌లోని రోలుగుంట మండలంలో ఒక క్వారీకి సుమారు రూ.7 కోట్లు రాయల్టీ విధించగాచ రూ.20 లక్షలు మాత్రమే చెల్లించి, వైసీపీకి చెందిన ఒక నాయకుడి అండతో క్వారీని నడిపించారు. అనకాపల్లి మండలంలోని పలు క్వారీల నిర్వాహకులు అప్పట్లో వైసీపీ నాయకులతో అంటకాగి రాయల్టీ చెల్లించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మారిన తరువాత కూడా రాయల్టీ, జరిమానాలను వసూలు చేయడంలో గనుల శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వుంటున్నారో అర్థం కావడంలేదు. వాస్తవానికి రాయల్టీ, పన్నులు చెల్లించని క్వారీల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి లైసెన్స్‌లు రద్దు చేసే అవకాశం ఉంది. కానీ జిల్లాలో ఒక్క క్వారీపైనా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవనే చెప్పాలి.

ప్రభుత్వం మారినా...

రాష్ట్రంలో పది నెలల క్రితం ప్రభుత్వంతోపాటు గనుల శాఖలో అధికారులు మారారు. సాక్షాత్తూ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ క్వారీల నిర్వాహకుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ, పన్ను బకాయిల వసూళ్లపై దృష్టి సారించలేదు. ఏ క్వారీ నిర్వాహకులు ఎంత బకాయి వున్నారు? వాటిని చెల్లించేలా ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై ఏనాడూ చర్చించలేదు. గతంలో వైసీపీ నాయకుల ఆధీనంలో ఉన్న కొన్ని క్వారీలను, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా పార్టీల నాయకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే రాయల్టీ, పన్ను బకాయిల వసూళ్లపై దృష్టి సారించడం లేదని తెలిసింది.

Updated Date - Apr 16 , 2025 | 12:37 AM