గిరిజన గ్రామాలకు రాచబాట
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:50 PM
రహదారి సౌకర్యం లేని మారుమూల పల్లెలకు కూడా మంచి రోజులు రానున్నాయి. నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి గుర్రాల వినియోగం, రోగులను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి డోలీ మోతలు తప్పనున్నాయి. మండలంలోని బల్లగరువు- మడ్రేబ్ రహదారి నిర్మాణ పనులను సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఉత్సాహంగా థింసా నృత్యం చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఎట్టకేలకు బల్లగరువు- మడ్రేబ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
తీరనున్న డోలీ మోత కష్టాలు
శరవేగంగా పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశం
గిరిజనుల్లో వెల్లివిరిసిన ఆనందం
థింసా నృత్యం చేసి సంబరాలు
అనంతగిరి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రహదారి సౌకర్యం లేని మారుమూల పల్లెలకు కూడా మంచి రోజులు రానున్నాయి. నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి గుర్రాల వినియోగం, రోగులను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి డోలీ మోతలు తప్పనున్నాయి. మండలంలోని బల్లగరువు- మడ్రేబ్ రహదారి నిర్మాణ పనులను సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఉత్సాహంగా థింసా నృత్యం చేసి సంబరాలు జరుపుకున్నారు.
మండలంలోని జీనబాడు, పినకోట, పెదకోట పంచాయతీల పరిధిలో గల బల్లగరువు నుంచి తున్సీబ్ వయా దాయర్తి మీదుగా మడ్రేబ్ వరకు 12 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి పీఎం జన్‌మన్ పథకం కింద ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నెలలో రూ.11.63 కోట్లతో నిధులు మంజూరు చేసింది. ఏప్రిల్ నెలలో డుంబ్రిగుడ పర్యటనకు వచ్చిన ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అయితే రెండు సార్లు టెండర్ పిలిచిన కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పనులు ప్రారంభంకాలేదు. మూడోసారి టెండర్‌కు సుమారు 8 మంది కాంట్రాక్టర్లు ముందుకు రావడం, ఈఎన్‌సీ నుంచి టెండర్ పూర్తిచేసిన అనంతరం అగ్రిమెంట్ వేగవంతం చేయడంలో ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపారు. ఏకేవీఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ రోడ్డు పనులను సొంత చేసుకుని నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించింది. సర్పంచ్ సిగరం గణేశ్, ఎంపీటీసీ సభ్యులు శ్రావణి, రామలక్ష్మి, వైస్ ఎంపీపీ బాడం శకుంతల, నాగేశ్వరరావు, రాంబాబు, కాంట్రాక్టర్ కాశీవిశేశ్వరరావు, అధికారుల సమక్షంలో పనులు మొదలయ్యాయి.
రహదారి పూర్తయితే ఎన్నో గ్రామాలకు మేలు
జీనబాడు, పినకోట, పెదకోట పంచాయతీలకు సంబంధించి బల్లగరువు నుంచి తున్సీబ్ వయా దాయర్తి మీదుగా మడ్రేబ్ రోడ్డు పనులు పూర్తయితే వాజంగి, పీచుమామిడి, గుమ్మంతి, కరకవలస, గుర్రాలబయలు, రెడ్డిపాడు, రాచకీలం, కోటలగరువుతో పాటుగా మడ్రేబ్, దాయర్తి, తున్సీబ్ గ్రామాల్లోని సుమారు రెండు వేల మంది గిరిజన జనాభాకు మేలు జరగనుంది.