Share News

ఆగని రౌడీషీటర్ల ఆగడాలు

ABN , Publish Date - Sep 18 , 2025 | 01:18 AM

నగరంలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు.

ఆగని రౌడీషీటర్ల ఆగడాలు

పోలీసుల హెచ్చరికలు బేఖాతరు

తరచూ ఎవరో ఒకరిపై దాడులు

నిఘాలో పోలీసులు విఫలం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా బేఖాతరు చేస్తున్నారు. తరచూ ఎక్కడో ఒకచోట దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని సీపీ ఆదేశించినా, స్టేషన్‌ స్థాయిలో అవి అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భీమిలి మండలం తాటితూరు గ్రామానికి చెందిన రౌడీషీటర్‌ పతివాడ వినోద్‌ అలియాస్‌ కిట్టు తన స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి చిట్టివలస సమీపంలోని ఒక హోటల్‌కు వెళ్లాడు. అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన పవన్‌కుమార్‌ అనే యువకుడితో గొడవపడ్డాడు. తన స్నేహితులతో కలిసి పవన్‌కుమార్‌ను తీవ్రంగా కొట్టి, అనంతరం బైక్‌పై ఈడ్చుకుంటూ తీసుకువెళ్లాడు. ప్రాణాపాయ స్థితిలో పవన్‌కుమార్‌ ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నగరంలో ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతామంటూ ఉన్నతాధికారులు చేస్తున్న హెచ్చరికలు ప్రకటలకే పరిమితం అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రౌడీషీటర్ల కదలికలపై నిశితంగా నిఘా పెట్టాలని, ఉదయం ఏ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు? ఎక్కడెక్కడకు వెళుతున్నారు?, ఏ పనిచేస్తున్నారనే దానితోపాటు నగరం విడిచివెళితే తక్షణం సమాచారం అందించే బాధ్యతను ఒక కానిస్టేబుల్‌కు అప్పగించాలని సీపీ శంఖబ్రతబాగ్చి అన్ని స్టేషన్ల సీఐలను ఆదేశించారు. అలాగే ప్రతి ఆదివారం రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిచి పరేడ్‌ నిర్వహించడంతోపాటు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. అయితే కౌన్సెలింగ్‌కు కొంతమంది రౌడీషీటర్లు గైర్హాజరవుతున్నా వారిపై సీఐలు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని అలుసుగా తీసుకుని రౌడీషీటర్లలో కొందరు దందాలు, దౌర్జన్యాలు చేస్తున్నారు. సెటిల్‌మెంట్‌లలో తలదూర్చుతున్నారు. రౌడీషీటర్లు రాత్రి తొమ్మిది గంటలయ్యేసరికి ఇంటికి చేరకపోయినా, ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లినా...వారిపై నిఘా పెట్టిన కానిస్టేబుల్‌ అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. కానీ, ఇది ఎక్కడా జరగడం లేదు. దీనివల్ల రౌడీషీటర్లు అర్ధరాత్రిపూట నగరంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఎదుటివారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా రౌడీషీటర్లపై సీపీ సీరియస్‌గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నగరవాసులు అంటున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 01:18 AM