Share News

రౌడీషీటర్‌ హత్య

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:07 AM

ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన వివాదం అనుకోకుండా ఒకరి మృతికి దారితీసింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి విశాఖపట్నంలోని ఎంవీపీ స్టేషన్‌ సీఐ ప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రౌడీషీటర్‌ హత్య
కశింకోట శ్రీధర్‌బాబు (ఫైల్‌ ఫొటో)

స్వస్థలం విజయవాడ

హంతకుడు విశాఖ వాసి

ఆలస్యంగా వెలుగుచూసిన ఉదంతం

అనకాపల్లి జిల్లా పోలవరం కాలువ వద్ద మృతదేహం గుర్తింపు

నాలుగు రోజుల క్రితం ఇద్దరూ కలిసి

కోర్టుకు హాజరు

అనంతరం మహిళ విషయమై గొడవ

ఈ క్రమంలోనే విజయవాడ వాసిపై కత్తితో దాడి

ఎలమంచిలి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):

ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన వివాదం అనుకోకుండా ఒకరి మృతికి దారితీసింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి విశాఖపట్నంలోని ఎంవీపీ స్టేషన్‌ సీఐ ప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

విశాఖ నగరానికి చెందిన ఎన్‌.గౌరీశంకర్‌పై రౌడ్‌ షీట్‌ ఉంది. దీంతో పోలీసులు కొంతకాలం క్రితం నగర బహిష్కరణ చేయడంతో ఎలమంచిలి వచ్చి ఉంటున్నాడు. అతనికి గతంలో విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్‌ఆర్‌ పేటకు చెందిన పాత నేరస్థుడు కశింకోట శ్రీధర్‌బాబు(35)తో పరిచయం ఏర్పడింది. ఒక చోరీ కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావడానికి ఈ నెల 7వ తేదీన ఇద్దరూ కలిసి కారులో విశాఖ వెళ్లారు. కేసు వాయిదా అనంతరం సీతమ్మధార రైతుబజార్‌ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తరువాత ఒక మహిళ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో గౌరీశంకర్‌ తన వద్ద ఉన్న కత్తితో శ్రీధర్‌బాబు చేతిపై తీవ్రంగా గాయపరిచాడు. రక్తస్రావం అవుతుండడంతో ఇద్దరూ కలిసి కారులో సమీపంలోని ఆస్పత్రికి వెళ్లారు. శ్రీధర్‌బాబు గాయానికి కుట్లు వేసిన తరువాత ఇద్దరూ కలిసి కారులో ఎలమంచిలి వైపు బయలుదేరారు. అయితే ఎనిమిదో తేదీ తెల్లవారుజామున దారిలోనే శ్రీధర్‌బాబు మృతిచెందాడు. దీంతో గౌరీశకంర్‌ కారును అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మునిసిపాలిటీలోని మర్రిబంద సమీపంలోని పోలవరం కాలువ వద్దకు తీసుకువెళ్లి, శ్రీధర్‌బాబు మృతదేహాన్ని అక్కడ పడేశాడు. ఇదిలావుండగా విశాఖ ఎంవీపీ పోలీసులు మరో కేసు విషయమై గౌరీశంకర్‌ను తొమ్మిదో తేదీన అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండగా...శ్రీధర్‌బాబు మృతి విషయం బయటపడింది. దీనిపై మరింత లోతుగా విచారించగా..మృతదేహాన్ని ఎలమంచిలి సమీపంలో పడేసినట్టు చెప్పాడు. దీంతో గురువారం సాయంత్రం ఎలమంచిలి వెళ్లి, స్థానిక పోలీసుల సహాయంతో మృతదేహం ఉన్న ప్రదేశానికి వెళ్లారు. మృతదేహం బాగా ఉబ్బిపోయి దుర్వాసన వస్తున్నది. శ్రీధర్‌బాబు మృతిగురించి విజయవాడలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం పోలీసులు క్లూస్‌ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. ఈలోగా మృతుడి తల్లి, భార్య, పిల్లలు ఎలమంచిలి చేరుకున్నారు. శ్రీధర్‌బాబు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. గౌరీశంకర్‌ను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు ఎంవీపీ సీఐ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Oct 11 , 2025 | 01:07 AM