Share News

కంచరపాలెంలో దోపిడీ

ABN , Publish Date - Oct 07 , 2025 | 01:35 AM

నగరంలోని కంచరపాలెం ఇందిరానగర్‌లో భారీ దోపిడీ జరిగింది.

కంచరపాలెంలో దోపిడీ

  • అర్ధరాత్రి ఇంటి వెనుక వైపు తలుపులు బద్ధలుకొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు

  • వృద్ధురాలితో పాటు ఆమె మనమడిని బంధించిన వైనం

  • 12 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు తీసుకుని ఇంటిముందు పార్కు చేసిన కారు తీసుకుని పరారీ

  • ఆ వాహనాన్ని మారికవలస వద్ద విడిచిపెట్టినట్టు గుర్తింపు

విశాఖపట్నం/కంచరపాలెం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని కంచరపాలెం ఇందిరానగర్‌లో భారీ దోపిడీ జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి వెనుక వైపు నుంచి లోనికి ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న వృద్ధురాలితోపాటు ఆమె మనుమడిని బంధించి ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, రూ.3 లక్షల నగదుతో పాటు కారును అపహరించుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రెడ్డికంచరపాలెం ఇందిరానగర్‌-5లో జాతీయ రహదారి పక్కన ధర్మాల ఆనందకుమార్‌రెడ్డికి రెండు అంతస్థుల ఇల్లు ఉంది. ఆనందకుమార్‌రెడ్డితోపాటు ఆయన తల్లి యల్లయ్యమ్మ (72), భార్య కోమలి, కుమారుడు కృష్ణకాంత్‌రెడ్డి (20) నివాసం ఉంటున్నారు. ఆనందరెడ్డి ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు శనివారం హైదరాబాద్‌ వెళ్లారు. ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆనందకుమార్‌రెడ్డి భార్య కోమలి, కుమార్తె దేవికారెడ్డి నిద్రించేందుకు పైఅంతస్థులోకి వెళ్లిపోయారు. యల్లయ్యమ్మ కింద అంతస్థులోని బెడ్‌రూమ్‌లో నిద్రించగా, కృష్ణకాంత్‌రెడ్డి హాల్‌లో పడుకున్నాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు, చేతికి గ్లౌజ్‌లు ధరించి ఇంటి వెనుక వైపు తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించారు. అలికిడికి యల్లయ్యమ్మ లేవగా... ఆమె నోరు, చేతులకు దుండగులు ప్లాస్టిక్‌ టేపు వేసి బంధించారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని బలవంతంగా లాక్కొన్నారు. అనంతరం బీరువా తెరిచి అందులో మరికొంత బంగారం, రూ.మూడు లక్షలు నగదు తీసుకున్నారు. బీరువా తెరిచినప్పుడు శబ్దం రావడంతో హాల్‌లో నిద్రపోతున్న కృష్ణకాంత్‌రెడ్డి లేచి బెడ్‌రూమ్‌లోకి రాగా, అతడిని దుండగులు కొట్టి, నోటికి, చేతులకు ప్లాస్టిక్‌ టేపు వేసి బంధించారు. అతని చేతికి ఉన్న డైమండ్‌ రింగ్‌ను లాక్కొన్నారు. అనంతరం బెడ్‌రూమ్‌లోని టీవీ స్టాండ్‌పై ఉన్న కారు తాళాలను తీసుకుని కిందకు వెళ్లిపోయారు. ఇంటి ముందు పార్కు చేసి ఉన్న కారుతో దుండగులు వుడాయించారు. దీనిపై యల్లయ్యమ్మ సోమవారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు నిమిత్తం క్రైమ్‌ పోలీసులకు బదిలీ చేశారు. దుండగులు ముఖానికి మాస్కులు, చేతికి గ్లౌజ్‌లు వేసుకున్నారని, జీన్‌ప్యాంట్లు ధరించి ఉన్నారని, హిందీలో మాట్లాడారని యల్లయ్యమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని బట్టి బిహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠా పని అయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

మారికవలస వద్ద కారును వదిలేసిన దుండగులు

ఆనంద్‌కుమార్‌రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు అతని కారుని మారికవలస వద్ద వదిలేసి అక్కడి నుంచి వేరొక వాహనంలో పరారైపోయారు. ఘటనా స్థలంతోపాటు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు రాత్రి 12.30 గంటల సమయంలో ఒక కారులో జాతీయ రహదారిపై దిగి అక్కడి నుంచి రోడ్డు దాటి ఆనంద్‌కుమార్‌రెడ్డి ఇంటి వైపు వచ్చినట్టు గుర్తించారు. ఎయిర్‌పోర్టు లేదంటే రైల్వేస్టేషన్‌ నుంచి ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి యాప్‌ల ద్వారా కారును బుక్‌ చేసుకుని అక్కడికి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. చోరీకి పాల్పడిన తర్వాత ఆనంద్‌కుమార్‌రెడ్డి కారులో ఎన్‌ఏడీ, సింహాచలం మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డులో వెళ్లినట్టు గుర్తించారు. పెదగదిలి జంక్షన్‌ వద్ద కారును ఆపి ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడి తర్వాత హనుమంతవాక మీదుగా మారికవలస వైపు వెళ్లినట్టు గుర్తించారు. అక్కడ కారును రోడ్డుపక్కన ఆపి మరో వాహనంలో శ్రీకాకుళం వైపు వెళ్లిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. చోరీకి పాల్పడింది అంతర్‌ రాష్ట్రముఠా అయితే వారికి ఆనంద్‌కుమార్‌రెడ్డి ఇంట్లో లేరని, కింది పోర్షన్‌లో వృద్ధురాలు, ఆమె మనుమడు మాత్రమే ఉంటారని ఎలా తెలుస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై కారుదిగిన దుండగులు ఎలాంటి తడబాటు లేకుండా నేరుగా ఆనంద్‌కుమార్‌రెడ్డి ఇంటికే వెళ్లడం బట్టి చూస్తే స్థానికుల సహకారం ఏమైనా ఉందా?...అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - Oct 07 , 2025 | 01:35 AM