Share News

నరకం చూపిస్తున్న రోడ్లు

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:27 AM

నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు నగరవాసులకు నరకం చూపిస్తున్నాయి.

నరకం చూపిస్తున్న రోడ్లు

  • ఇష్టారాజ్యంగా రహదారులను తవ్వేస్తున్నారు..

  • జీవీఎంసీతో ఇతర శాఖల అధికారుల మధ్య కానరాని సమన్వయం

  • పైపు లైన్లు, యూజీడీ, భూగర్బ కేబుళ్ల కోసం యథేచ్ఛగా రోడ్ల తవ్వకం

  • ఒకవైపు నుంచి కొత్త రోడ్డు వేస్తే మరోవైపు నుంచి తవ్వేస్తున్న వైనం

  • తిరిగి రోడ్లను పూడ్చడంలో అంతులేని నిర్లక్ష్యం

  • తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నగరవాసులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు నగరవాసులకు నరకం చూపిస్తున్నాయి. జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు ఒకవైపు కొత్త రోడ్ల నిర్మాణం చేస్తుంటే... మరోవైపు నుంచి నీటి సరఫరా, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల నగర ంలోని రహదారులన్నీ చిందరవందరగా తయారవ్వడంతోపాటు రూ.కోట్ల ప్రజా ధనం వృథాగా మారుతోంది. జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులకు ఇతర విభాగాలు, శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో ఏటా వివిధ గ్రాంటుల కింద సుమారు రూ.150 కోట్లు ఖర్చుపెట్టి రోడ్ల నిర్మాణం చేస్తుంటారు. ఒకసారి రోడ్డు నిర్మాణం చేస్తే నగర పరిఽధిలో కనీసం ఐదేళ్లపాటు నిర్వహణ అవసరం ఉండదు. ఒకవేళ ఈలోగా ఏదైనా మరమ్మతు జరిగినా, గుంతలు ఏర్పడినా సంబంధిత కాంట్రాక్టరే నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ నగరంలో కొత్తగా నిర్మించిన రోడ్డు కనీసం ఏడాదిపాటు కూడా సుందరంగా ఉండకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొత్తగా రోడ్డు వేసిన కొద్ది రోజులకే అదే రోడ్డుని మరొక పనికోసం జీవీఎంసీలోని తాగునీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎలక్ర్టికల్‌ విభాగాలతోపాటు భూగర్భ విద్యుత్‌ కేబుళ్లు వేయడానికి ఏపీఈపీడీసీఎల్‌, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా నీటి సరఫరా పైపు లైన్ల ఏర్పాటు కోసం తవ్వేస్తుండడం నగరవాసులను ఆగ్రహానికి గురిచేస్తోంది. శివాజీ పార్కు రోడ్డును ఏడాది కిందట రూ.కోట్లు వెచ్చించి కొత్తగా వేయడంతో ఆ మార్గం అందంగా కనిపించేది. కానీ ఇటీవల ఈ రోడ్డును నీటి సరఫరా పైపు లైన్ల కోసం తవ్వేయడంతో రోడ్డంతా బురదమయంగా మారిపోయింది. వాహనచోదకులు సైతం ఇబ్బందులకు గురవ్వడం, ప్రమాదాల బారినపడడం జరుగుతోంది. అలాగే అక్కయ్యపాలెం మహరాణి పార్లర్‌ జంక్షన్‌ నుంచి 80 ఫీట్‌ రోడ్డు మొత్తం అమృత్‌ పథకం కింద నీటి సరఫరా పైపు లైన్ల ఏర్పాటు నిమిత్తం తవ్వేయడంతో ఆరు నెలల కిందట నిర్మించిన తారురోడ్డు కాస్త మట్టిరోడ్డు మాదిరిగా కనిపిస్తోంది. సీతమ్మధార ప్రాంతంలో అన్ని రోడ్లను జీవీఎంసీ ఆరు నెలలు కిందట నిర్మిస్తే.. అమృత్‌ కోసం విచ్చలవిడిగా తవ్వేశారు. గురుద్వారా కూడలి నుంచి సత్యం జంక్షన్‌ వరకు జాతీయ రహదారి నిర్మాణం ఇటీవలే జరిగింది. కానీ విద్యుత్‌ కేబుళ్ల కోసం వెంటనే యంత్రాలతో రోడ్డును తవ్వేశారు. రోడ్లను తవ్విన తర్వాత మట్టితో కొంతవరకు కప్పి, తర్వాత గ్రావెల్‌ వేసి పైన కాంక్రీట్‌ వేసి పూడ్చాలి. దీనివల్ల భవిష్యత్తులో రోడ్డు కుంగకుండా ఉండడంతోపాటు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందనేది ఇంజనీర్ల అభిప్రాయం. కానీ ఏదైనా అవసరం కోసం రోడ్డు తవ్విన తరువాత ఆయా రహదారులను సక్రమంగా పూడ్చకుండా తవ్వి తీసిన మట్టితోనే పూడ్చేసి వదిలేస్తున్నారు. దీనివల్ల రోడ్లన్నీ గుంతలుగా మారడం, వర్షం పడితే రహదారి అంతా మట్టిమయంగా మారిపోతోంది.

శాఖల మధ్య సమన్వయం కుదిరేది ఎప్పుడు?

జీవీఎంసీ అధికారులు ఒక మార్గంలో కొత్తగా రోడ్డు వేయాలనుకుంటే ఆ విషయాన్ని ముందుగానే గ్రేటర్‌ ఇంజనీరింగ్‌లోని ఇతర విభాగాలతోపాటు ఏపీఈపీడీసీఎల్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడ్‌ చేసే సంస్థలకు సమాచారం ఇవ్వాలి. ఆయా శాఖలు, విభాగాల ఆధ్వర్యంలో ఆ మార్గంలో పైపు లైన్లు, కేబుళ్ల నిర్మాణాల కోసం రోడ్డును భవిష్యత్తులో తవ్వాల్సి ఉంటుందని భావిస్తే... ఆ విషయాన్ని జీవీఎంసీ పబ్లిక్‌ వర్క్స్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులకు తెలియజేయాలి. కొత్తగా రోడ్డు వేసే మార్గంలో ఆయా శాఖలు, విభాగాల అధికారులు తమ పని పూర్తి చేసిన తరువాత కొత్తగా బీటీ రోడ్డు నిర్మిస్తే ఆ రోడ్డు ఐదేళ్లు కాకుండా ఏడెనిమిదేళ్లపాటు గుంతలు లేకుండా పటిష్ఠంగా ఉంటుంది. దీనివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉండడంతోపాటు ప్రజా ఽధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసినట్టవుతుంది. నగరంలో రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్యేడంపై వివాదం తలెత్తిన ప్రతీసారి అన్ని శాఖల అధికారులు సమావేశమై... ఇకపై రోడ్ల నిర్మాణం, తవ్వకంపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులు అభిప్రాయానికి వస్తున్నారు. కానీ ఏళ్లు గడిచినా ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. ఇకనైనా అధికారులు రోడ్ల నిర్మాణం, తవ్వకం విషయంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:27 AM