Share News

చెరువుల మీదుగా రహదారులా!?

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:12 AM

రాబోయే ఇరవై ఏళ్లను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌-2041 తప్పుల తడకలా తయారైందని, వాటిని సవరించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.

చెరువుల మీదుగా రహదారులా!?

  • పార్కింగ్‌ ఏర్పాట్లు శూన్యం

  • వుడా లేఅవుట్ల మీదుగా రహదారులతో సంస్థకే చెడ్డపేరు

  • మాస్టర్‌ ప్లాన్‌-2041పై వెల్లువెత్తిన అభ్యంతరాలు

  • సిరిపురం-ఆశీల్‌మెట్ట రోడ్డును విస్తరణ ఆచరణ సాధ్యం కాదన్న ఎమ్మెల్యే వెలగపూడి

  • నగరంలో ఏ రోడ్డునూ 30 మీటర్లకు మించి విస్తరించవద్దని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌, కమిషనర్‌లకు సూచన

  • అనకాపల్లి వయా విశాఖపట్నం ఆనందపురం రహదారి విస్తరణను 60 మీటర్లకు పరిమితం చేయాలని పలువురి విజ్ఞప్తి

విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):

రాబోయే ఇరవై ఏళ్లను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌-2041 తప్పుల తడకలా తయారైందని, వాటిని సవరించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. నగరంలో పార్కింగ్‌ సమస్య తీవ్రంగా ఉందని వీఎంఆర్‌డీఏ సిరిపురం జంక్షన్‌లో మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ భవనం నిర్మించిందని, మాస్టర్‌ ప్లాన్‌లో మాత్రం ఎక్కడా పార్కింగ్‌ ఏరియాను మార్కింగ్‌ చేయలేదని పలువురు ప్రస్తావించారు. మాస్టర్‌ ప్లాన్‌ అంటూ ప్రైవేటు స్థలాలను తీసుకొని 100 నుంచి 200 అడుగుల వరకు రహదారులను విస్తరిస్తున్నారని, కానీ క్షేత్ర స్థాయి అధికారులు బాధ్యతారాహిత్యం వల్ల ఆ రోడ్లను వ్యాపారులు ఆక్రమించి దుకాణాలు పెట్టుకుంటున్నారని, వాహనాల రాకపోకలకు పాత రహదారే మిగులుతున్నదని ఇంకొందరు ఆరోపించారు.

వీఎంఆర్‌డీఏలో చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌లు గురువారం నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, లోకం నాగమాధవి తదితరులు హాజరై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ, నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేసుకొని వెళతామని, ఆ ప్రాజెక్టులో పైన నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌ హైవే వస్తుందని వెల్లడించారు. అదేవిధంగా విశాఖపట్నం పోర్టుకు ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ ఉందని, దాంతో కూడా ఈ మాస్టర్‌ ప్లాన్‌ ఇంటిగ్రేట్‌ అయ్యేలా చూస్తామన్నారు.

అభ్యంతరాలు...

- కాపులుప్పాడలో 1998లో వుడా లేఅవుట్‌ వేసి పేద, మధ్య తరగతి ప్రజలకు ప్లాట్లు విక్రయించిందని, ఇప్పుడు ఆ లేఅవుట్‌ మధ్య నుంచి మాస్టర్‌ ప్లాన్‌ రహదారి ప్రతిపాదించారని, దీనివల్ల సంస్థకే చెడ్డపేరు వస్తుందని, తక్షణం అటువంటి రహదారులను తీసేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు.

- సిరిపురం జంక్షన్‌ నుంచి సంపత్‌ వినాయకుడి గుడి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా రైల్వే స్టేషన్‌ వరకు 45 మీటర్ల రహదారి ప్రతిపాదించారని, అది ఆచరణ సాధ్యం కాదని, అలా చేస్తే జీవీఎంసీ కమిషనర్‌ బంగ్లా, సంపత్‌ వినాయకుడి ఆలయం తదితరాలన్నీ పోతాయని నగరంలో ఏ రహదారిని కూడా 30 మీటర్లకు మించి విస్తరించవద్దని ఎమ్మెల్యే వెలగపూడి సూచించారు.

- సింహాచలం రైల్వేస్టేషన్‌, బాజీ జంక్షన్‌, కాకాని నగర్‌, విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో 30 నుంచి 40 అడుగుల రహదారులు ఉన్నాయని, వాటిని విస్తరించాలనే ప్రతిపాదన పెట్టకపోతే రైల్వే అధికారులు భూములు ఇవ్వరని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాల్లో అవసరమైన రహదారులను చూపించాలని ఎమ్మెల్యే గణబాబు కోరారు.

- అనకాపల్లి నుంచి విశాఖ నగరం మీదుగా ఆనందపురం వరకు జాతీయ రహదారిని హెచ్చు తగ్గులు లేకుండా 60 మీటర్ల మేర విస్తరిస్తే అందులోనే గ్రీన్‌ బెల్డ్‌, కాలువలను కలిపి చూపించాలని, వాటి కోసం అదనంగా మరికొంత స్థలం కావాలనొద్దని కొందరు కోరారు.

- విశాఖ నుంచి భీమిలి బీచ్‌ మార్గంలో గ్రీన్‌ బెల్ట్‌ను సముద్రం వైపు మాత్రమే పెట్టాలని, ప్రైవేటు స్థలాలు ఎక్కువగా ఉన్నా ఎడమ వైపు పెట్టవద్దని కొన్ని సంఘాలు లేఖలు సమర్పించాయి.

- ఆనందపురం మండలం బోయపాలెంలో చెరువు మీదుగా మాస్టర్‌ ప్లాన్‌ రహదారి వేశారని దానిని తీసేయాలని అక్కడి రైతులు విన్నవించారు.

- గంభీరం పంచాయతీలో కొన్ని సర్వే నంబర్లలో భూమి ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా చూపించారని, అది వైసీపీ నేతలు కక్షపూరితంగా చేసినందున దానిని మిక్స్‌డ్‌ జోన్‌లోకి మార్చాలని సర్పంచ్‌ కోరారు.

- భీమిలి చిన్నబజారులో ప్రతిపాదించిన రహదారి వల్ల తమ ఇళ్లను కోల్పోతామని అందుకని ఆ రహదారిని తీసేయాలని అక్కడి వారు కోరారు.

- భోగాపురం, డెంకాడల్లో ప్రతిపాదించిన 24 మీటర్ల రహదారులు చెరువులు మీదుగా చూపించారని, వాటిని తొలగించాలని కోరారు.

- వెంకోజీపాలెం నుంచి హెచ్‌బీ కాలనీ మీదుగా సీతమ్మధార వరకూ ప్రస్తుత రహదారినే ఉంచాలని, విస్తరణ వద్దని పలువురు కోరారు.

- పొర్లుపాలెం సర్వే నంబర్లు 63 నుంచి 68 వరకు ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతంలో చూపించారని, నివాస ప్రాంతంగా మార్చాలని విన్నవించారు.

అది సాయిరెడ్డి కార్యాలయంలో తయారైన మాస్టర్‌ ప్లాన్‌

ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబు

వైసీపీ హయాంలో మాస్టర్‌ ప్లాన్‌-2041ను వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో కాకుండా సాయిరెడ్డి కార్యాలయంలో తయారు చేశారని, అందుకే నాడు 17 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా డ్రాఫ్ట్‌లో ఉన్న ప్రతిపాదనలు పక్కన పెట్టి ఫైనల్‌ దాంట్లో మార్చేసిన ప్లాన్‌ పెట్టారని ఆరోపించారు. అందుకే వాటిని సవరించాలని సీఎం చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 01:12 AM