Share News

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు

ABN , Publish Date - Dec 16 , 2025 | 01:38 AM

ప్రతి జిల్లాలో ఒక రహదారిని కొత్త సాంకేతిక విధానంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు

తొలివిడత జిల్లాలో వెంకన్నపాలెం- లింగాలతిరుగుడు రహదారి ఎంపిక

8.6 కిలోమీటర్ల దూరం.. రూ.3.5 కోట్లు వ్యయం

నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

ఖర్చు తక్కువ.. మన్నిక ఎక్కువ

చోడవరం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

ప్రతి జిల్లాలో ఒక రహదారిని కొత్త సాంకేతిక విధానంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని బీఎన్‌ రోడ్డులో చోడవరం మండలం వెంకన్నపాలెం నుంచి సబ్బవరం మండలం లింగాలతిరుగుడు వరకు రహదారిని ఎంపిక చేశారు. రహదారుల నిర్మాణానికి సిమెంటు లేదా తారు వినియోగిస్తుంటారు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. దీనివల్ల ఖర్చుతగ్గడంతోపాటు రోడ్డు మన్నికకు వుంటుంది. వర్షం నీరు నిల్వ వున్నప్పటికీ రోడ్డు పాడవ్వదు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన వెయ్యి కోట్ల రూపాయలలో వెంకన్నపాలెం- లింగాల తరుగుడు రహదారికి రూ.3.5 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 8.6 కిలోమీటర్ల పొడవు వున్న ఈ రోడ్డును ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అభివృద్ధి చేయనున్నట్టు ఆర్‌అండ్‌బీ ఏఈ సత్యప్రకాశ్‌ తెలిపారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియలో వుందని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే వెంకన్నపాలెం నుంచి సబ్బవరం వరకు ప్రయాణం సాఫీగా సాగుతుందని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 01:38 AM