కాంక్రీట్ మిక్సర్లతో రహదారులు నాశనం
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:01 AM
నగరంలో రహదారులను పరిశుభ్రంగా, ప్రమాద రహితంగా ఉంచాలని అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుంటే కొందరు వాటికి నష్టం కలిగిస్తున్నారు.
దారిపొడవునా కాంక్రీట్...
గంటల్లోనే ఘనీభవించి... ప్రమాదాలకు ఆస్కారం
నగర శివార్లలో కుప్పలుగా కాంక్రీట్ వ్యర్థాలు
పట్టని జీవీఎంసీ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో రహదారులను పరిశుభ్రంగా, ప్రమాద రహితంగా ఉంచాలని అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుంటే కొందరు వాటికి నష్టం కలిగిస్తున్నారు. వారి పనులే ముఖ్యంగా భావించి ఇతర అంశాలను విస్మరిస్తున్నారు. ముఖ్యంగా భారీ భవనాల నిర్మాణానికి కాంక్రీట్ మిక్సర్‌ను తరలించే లారీలు నగరంలో ఇష్టానుసారంగా నడుస్తున్నాయి.
ఇంధనంతో నిండిన వాహనాలను ఎంత జాగ్రత్తగా నడుపుతారో వీటిని కూడా అంతే జాగ్రత్తగా, నెమ్మదిగా నడపాల్సి ఉంది. పొరపాటున వాటి నుంచి కాంక్రీట్ మిక్సర్ కిందిపడితే అది కొద్ది గంటల్లోనే మళ్లీ తీయడానికి వీల్లేకుండా రోడ్డుకు అతుక్కుపోతుంది. చక్కటి తారు రోడ్లపై కాంక్రీట్ ముద్దలు ముద్దలుగా పేరుకుపోయి స్పీడ్ బ్రేకర్‌గా తయారవుతోంది. వాటిపై నుంచి ద్విచక్ర వాహనాలు అజాగ్రత్తగా వెళితే ప్రమాదాలు జరుగుతాయి. సాధారణంగా ఈ లారీల నుంచి కాంక్రీట్ కింద పడకుండా, లీకేజీ లేకుండా జాగ్రత్తగా లాక్ చేయాలి. కానీ ప్లాంట్ల వద్ద పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానికి డ్రైవర్ల జోరు తోడై కాంక్రీట్ రోడ్లపై పేరుకుపోతోంది. సిరిపురంలో టైకూన్ హోటల్ నుంచి వీఎంఆర్‌డీఏ భవనం వరకూ రెండు భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి పదుల సంఖ్యలో రోజూ ఈ కాంక్రీట్ మిక్సర్లు తిరుగుతున్నాయి. సత్యం జంక్షన్ వద్ద హైవేపై మొదలుకొని బుల్లయ్య కాలేజీ మీదుగా...స్వర్ణభారతి రోడ్డులోకి వెళ్లి అక్కడి నుంచి వీఐపీ మార్గంలో ఆయా నిర్మాణాల వద్దకు వెళుతున్నాయి. ఆ మార్గం అంతా ఇప్పుడు ఈ కాంక్రీట్‌తో ప్రమాద భరితంగా మారింది. ఇలాంటి వాటిని జీవీఎంసీ అధికారులు గుర్తించి వెంటనే జరిమానా విధిస్తుంటారు. ఇంతకు ముందు సాయికాంత్‌వర్మ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేసినందును శర్వాణి కాంక్రీట్ మిక్సర్ సంస్థకు జరిమానా విధించారు. పాడు చేసిన రహదారి వ్యయాన్ని వారి నుంచి వసూలు చేశారు. ఆ తరువాత అలాంటి చర్యలు చేపట్టే అధికారులు లేకపోవడంతో వారు ఇష్టానుసారం రహదారులను పాడుచేస్తున్నారు. ఇప్పుడు కలెక్టరే ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు కాబట్టి తక్షణమే ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చి, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.
అంతేకాకుండా నగర శివార్లలో అంటే మిథిలాపురి వుడా కాలనీ నుంచి మారికవలస వెళ్లే మార్గంలో ఈ మిక్సర్లు మిగిలిన వ్యర్థాలను రోడ్ల పక్కన కుప్పులగా పోసి వెళ్లిపోతున్నాయి. చెత్తకుప్పలైతే తరలించగలరు గానీ వాటిని తొలగించే అవకాశం ఉండటం లేదు. ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న ఇలాంటి పనులు మళ్లీ జరగకుండా ఆయా సంస్థలకు తగిన హెచ్చరికలు జారీచేయాల్సి ఉంది. నగరంలో శర్వాణితో పాటు నాగార్జున, ఎల్ అండ్ టి, ఆర్‌డీసీ, సత్య, కోస్టల్, అపర్ణ, ఎంవీవీ పేర్లతో మిక్సర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. కొందరు భవన నిర్మాతలైతే రహదారి పక్కనే ప్లాంటు పెట్టి అక్కడే కాంక్రీట్ తయారుచేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సి ఉంది.