Share News

నత్తనడకన వంజంగి హిల్స్‌ రోడ్డు పనులు

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:37 AM

ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు వెళ్లే మార్గం అభివృద్ధికి రూ.2.5 కోట్లు మంజూరై ఏడాది దాటినా ఇప్పటికీ రోడ్డు నిర్మాణం పూర్తికాలేదు. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో రోడ్డంతా అసంపూర్తిగా ఉండడంతో పర్యాటకులు, స్థానికులకు అవస్థలు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

నత్తనడకన వంజంగి హిల్స్‌ రోడ్డు పనులు
: కోతకు గురై ప్రమాదకరంగా ఉన్న వంజంగి మార్గం

- రూ.2.5 కోట్లు మంజూరై ఏడాది దాటినా పూర్తికాని నిర్మాణం

- మరో నెల రోజుల్లో ప్రారంభంకానున్న పర్యాటక సీజన్‌

- అసంపూర్తి రోడ్డుతో అవస్థలు తప్పవని ఆందోళన

- ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఈ సమస్యకు కారణం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు వెళ్లే మార్గం అభివృద్ధికి రూ.2.5 కోట్లు మంజూరై ఏడాది దాటినా ఇప్పటికీ రోడ్డు నిర్మాణం పూర్తికాలేదు. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో రోడ్డంతా అసంపూర్తిగా ఉండడంతో పర్యాటకులు, స్థానికులకు అవస్థలు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

వాస్తవానికి వంజంగి హిల్స్‌ వెళ్లే రోడ్డు నిర్మాణంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఏడాదైనా నిర్మాణం పూర్తికాలేదని తెలుస్తున్నది. మండల కేంద్రం పాడేరు నుంచి వంజంగి హిల్స్‌కు చేరుకునేందుకు ఆరు కిలోమీటర్ల వరకు అంటే వంజంగి హిల్స్‌ కూడలి వరకు తారురోడ్డు ఉంది. కానీ అక్కడి నుంచి సుమారుగా రెండు కిలోమీటర్లు ఘాట్‌మార్గంలో పక్కా రోడ్డు సదుపాయం లేదు. జంక్షన్‌ వరకు వచ్చే పర్యాటకులకు ఆ ఘాట్‌ మార్గం నుంచి సన్‌రైజ్‌ పాయింట్‌కు వెళ్లే కొండ ప్రదేశం వరకు మట్టి రోడ్డు ఉంది. అయితే ఆ మార్గం సక్రమంగా లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర అవస్థలు పడడంతో పాటు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యను అధిమించాలనే లక్ష్యంతో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ వంజంగి హిల్‌ రోడ్డు నిర్మాణానికి గతేడాది జూలైలో రూ.2 కోట్ల 50 లక్షలు మంజూరు చేశారు.

ఏడాదిగా కొనసా....గుతున్న రోడ్డు నిర్మాణం

వంజంగి హిల్స్‌ కూడలి నుంచి ప్రధాన కొండ ప్రవేశ మార్గానికి చేరుకునేందుకు ఉన్న సుమారు రెండు కిలోమీటర్ల ఘాట్‌ మార్గాన్ని పక్కా రోడ్డుగా అభివృద్ధికి చేసేందుకు గతేడాది జూలై నెలలోనే రూ.2కోట్ల 50 లక్షలు మంజూరయ్యాయి. దీంతో గతేడాది ఆ మార్గంలో రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ నేటికీ పూర్తి కాలేదు. రోడ్డును వెడల్పు చేయడం, అవసరమైన చోట్ల మట్టి పూడ్చివేత, పలు చోట్ల కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టారు. సుమారుగా 60 నుంచి 70 శాతం పనులు చేసినప్పటికీ మిలిగిన పనులు నేటికీ పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వేసిన మట్టిరోడ్డు కోతకు గురై వాహనాల రాకపోకలకు మరింతగా ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్‌ మొదలు కానుండడంతో ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సీజన్‌లో వచ్చే పర్యాటకుల రాకపోకలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఈ రోడ్డు నిర్మాణంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్లే నేటికీ పనులు పూర్తికాలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంజంగి హిల్‌ రోడ్డును పూర్తి చేయాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:37 AM