నత్తనడకన రోడ్ల పనులు
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:02 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పది రహదారుల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పది పనులకు ఎన్‌డీబీ నుంచి రూ.220 కోట్ల రుణం
నాలుగేళ్లయినా పది శాతం కూడా పూర్తికాని వైనం
ఇప్పటివరకూ కేవలం రూ.24.56 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తి
రద్దయ్యే ప్రమాదం
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పది రహదారుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో గల ఈ రహదారుల పునర్నిర్మాణానికి 2021లో టెండర్లు ఆహ్వానించగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సంస్థ పనులను దక్కించుకుంది. అయితే, కొన్ని నెలలపాటు పనులు ప్రారంభించలేదు. ఒక మంత్రి సూచనతో ఎన్నికలకు కొన్ని నెలల ముందు పనులను మొదలెట్టింది. అయినా ఇప్పటికీ పది శాతం కూడా పూర్తికాలేదు. మొత్తం ఎన్‌డీబీ రుణం రూ.220 కోట్లతో పనులను చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకూ కేవలం రూ.24.56 కోట్ల విలువైనవి మాత్రమే పూర్తయ్యాయంటే ఎంత మందకొడిగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వేగం లేకపోవడం, ఇతర కారణాల వల్ల మంజూరైన పనులు రద్దయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే, దీనిపై అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. ఇదిలావుంటే మొత్తం పది పనుల్లో రెండు పనులు ఇప్పటివరకూ ప్రారంభమే కాలేదు. మిగిలిన ఎనిమిది కూడా పది శాతం మాత్రమే పూర్తయ్యాయి.
నిలిచిపోయిన పనులు..
మొత్తం 87.74 కిలోమీటర్లు మేర రోడ్ల విస్తరణ, మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం ఎన్‌డీబీ నుంచి రూ.220.62 కోట్ల రుణం తీసుకుంది. అయితే, ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నాటికి రూ.24.56 కోట్ల విలువజేసే పనులను మాత్రమే పూర్తిచేశారు. వీటికి సంబంధించి రూ.15.32 కోట్ల బిల్లులను చెల్లించగా, మరో రూ.1.16 కోట్ల విలువజేసే బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన బిల్లులు చెల్లించాల్సి ఉంది.
ఇవీ పనులు వివరాలు..
రోడ్డు కిలోమీటర్లు మంజూరైన పూర్తయిన పనుల
నిధులు(రూ.కోట్లు) విలువ(రూ.కోట్లు)
భీమునిపట్నం-నర్సీపట్నం 10.85 రూ.31.45 రూ.0.92
విజయనగరం-పద్మనాభం-శొంఠ్యాం 3.55 రూ.10.04 రూ.2.21
అనకాపల్లి-వెంకన్నపాలెం 5.03 రూ.12.33 రూ.0
సింహాచలం-పినగాడి 7.13 రూ.13.92 రూ.0.62
నర్సీపట్నం-రేవుపోలవరం 9.6 రూ.20.78 రూ.0.15
పాడేరు-పెదబయలు-
ముంచంగిపుట్టు 4.98 రూ.11.71 రూ.7.60
నర్సీపట్నం-చింతపల్లి-సీలేరు 1.00 రూ.2.57 రూ.0
వడ్డాది-పాడేరు రోడ్డు 12.7 రూ.23.59 రూ.0.9
భీమునిపట్నం-నర్సీపట్నం రోడ్డు 28.6 రూ.79.81 రూ.10.73
నర్సీపట్నం-తుని రోడ్డు 4.3 రూ.14.42 రూ.1.43