శరవేగంగా రహదారుల పనులు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:23 AM
మండలంలోని పినకోట, జీనబాడు పంచాయతీ పరిధిలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనులను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ బి.బాలూనాయక్ పరిశీలించారు.
పరిశీలించిన పీఆర్-ఆర్‌డీ ఇంజనీర్-ఇన్-చీఫ్ బాలూ నాయక్
నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
అనంతగిరి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పినకోట, జీనబాడు పంచాయతీ పరిధిలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనులను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ బి.బాలూనాయక్ పరిశీలించారు. ముందుగా సమిధ నుంచి చింతపాక, తట్టపూడి, చిందులపాడు, పెదబూరగ వరకు 6.56 కిలోమీటర్ల మేర రూ.6.67 కోట్లతో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు సుదూరం కాలినడకన వెళ్లారు. పనులను పరిశీలించి, గిరిజనులతో కొంతసేపు మాట్లాడారు. గుమ్మంతి నుంచి రెడ్డిపాలెం, రాచకీలం వరకు 5.49 కిలోమీటర్ల మేర రూ.5.86 కోట్లతో జరుగుతున్న పనులను పరిశీలించారు. రోడ్డు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. అక్కడ నుంచి టోకూరు పంచాయతీ నుంచి బొర్రాపూలుగుడ వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఆయన వెంట పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఈఈ కొండయ్యపడాల్, డీఈఈ రామమ్, పీఐయూ డీఈఈ రవికుమార్, ఏఈలు సాంబశివరావు, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.