రోడ్ టెర్రర్
ABN , Publish Date - Dec 22 , 2025 | 01:21 AM
‘సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డులో శుక్రవారం సాయం త్రం ఓ ఫంక్షన్‌హాల్ వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో దంపతులతోపాటు వారి 11 ఏళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయింది.’
ఆందోళన కలిగిస్తున్న రహదారి ప్రమాదాలు
ఈ ఏడాది ఇప్పటివరకు 1,013 దుర్ఘటనలు
332 మంది మృతి, 959 మందికి గాయాలు
డేంజర్‌జోన్‌లో విశాఖ నగరం
ప్రమాదాల నియంత్రణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అయినా చలానాల వసూలుపైనే సిబ్బంది దృష్టి
ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేసిన వైనం
ప్రజల్లో అవగాహన పెరిగితేనే ప్రాణాలకు రక్షణ
(విశాఖపట్నం,ఆంధ్రజ్యోతి)
‘సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డులో శుక్రవారం సాయం త్రం ఓ ఫంక్షన్‌హాల్ వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో దంపతులతోపాటు వారి 11 ఏళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయింది.’
మధురవాడ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వృద్ధుడు మృతిచెందాడు.’
నగరంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. సగటున రోజుకొకరు ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీ/సీపీల సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు విశాఖ జిల్లాలో ప్రమాదాల తీవ్రతను వెల్లడిస్తూ, నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
నగరంలో రోడ్డు ప్రమాదాలు రెండేళ్లుగా తగ్గుముఖం పడితే...ఈ ఏడాది పెరిగాయి. వాహన చోదకులు వేగంగా వెళ్లిపోవాలనే ఆత్రుతలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. బీఆర్‌టీఎస్, బీచ్‌రోడ్డు, నగరంలోని ప్రధాన రోడ్లపై కంటే జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న మొదటి మూడు జిల్లాల్లో విశాఖ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ ఏడాది 332 మంది మృతి
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబరు నెలాఖరుకు రోడ్డు ప్రమాదాల కారణంగా 332 మంది ప్రాణాలు కోల్పోయారు. సీపీ శంఖబ్రతబాగ్చి ప్రత్యేక కార్యాచరణ అమలుచేయడంతో గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే 20 శాతం ప్రమాదాలు తగ్గాయి. ఆ తరువాత పెరగసాగాయి. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వారిని సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి చలాన్ల జారీకి ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ కూడళ్లలో ట్రాఫిక్‌ను పట్టించుకోవడం లేదు. మరికొందరు కూడళ్లలోని ఐలాండ్‌పై కూర్చొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించకుండా, సమీపంలోని అవుట్‌పోస్టులు, రోడ్డుపక్కన చెట్ల కిందకు వెళ్లిసెల్‌ఫోన్‌తో గడిపేస్తున్నారు.
ఇదీ లెక్క...
2022లో 1,353 ప్రమాదాల్లో 358 మంది మృతిచెందగా, 1,100 మంది క్షతగాత్రులయ్యారు. 2023లో జరిగిన 1,180 ప్రమాదాల్లో 336 మంది ప్రాణాలు కోల్పోగా, 1080 మంది క్షతగాత్రులయ్యారు. 2024లో 1,106 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 317 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 980 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది నవంబరు నెలాఖరుకు 1,013 ప్రమాదాలు జరగ్గా 332 మంది కన్నుమూశారు. మరో 959 మంది క్షతగాత్రులయ్యారు. ఇవికాకుండా గత వారం రోజుల్లోనే రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 12 మంది మృత్యువాతపడినట్టు పోలీసులు పేర్కొన్నారు.
సీపీ దృష్టిసారించకపోతే బేజారే
నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకోకుంటే ప్రమాదాలు పెరిగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు కాకుండా, వాహనాల క్రమబద్ధీకరణపై సిబ్బంది దృష్టిపెట్టేలా ఆదేశాలివ్వాలి. ట్రాఫిక్ సిబ్బంది అసలు విధులను గాలికొదిలేసి ఇతర సిబ్బందితో పిచ్చాపాటి కుబుర్లు చెప్పుకుంటున్న తీరుపై నిఘా ఏర్పాటుచేయాలి. ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై కనిపించకపోవడంతో చోదకులు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాలు తగ్గాలంటే అన్నివర్గాల ప్రజల్లో అవగాహన పెరగాలి. ఆదిశగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
గత మూడేళ్లలో నమోదైన రోడ్డుప్రమాదాలు
సంవత్సరం ప్రమాదాలు మరణాలు క్షతగాత్రులు
2022 1353 358 1100
2023 1180 336 1080
2024 1106 317 980
2025 1013
(నవంబరు నాటికి) 332 959