Share News

అన్ని గ్రామాల్లో ఆర్‌వో ప్లాంట్లు

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:26 AM

తాగునీటి కల్పనలో భాగంగా ప్రతి గ్రామంలో ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా అభివృద్ధి, మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.

అన్ని గ్రామాల్లో ఆర్‌వో ప్లాంట్లు
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సీఎం రమేశ్‌. పక్కన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి అనిత, ఎమ్మెల్యే బండారు, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ జాహ్నవి, ఎస్పీ తుహిన్‌ సిన్హా

నేరాల కట్టడికి సీసీ కెమెరాలు

సీఎస్‌ఆర్‌ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు

అనకాపల్లి, నర్సీపట్నం ఆస్పత్రుల అభివృద్ది

జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి

జిల్లా అభివృద్ధి, మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఎంపీ సీఎం రమేశ్‌

జిల్లాలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై సమీక్ష

అనకాపల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): తాగునీటి కల్పనలో భాగంగా ప్రతి గ్రామంలో ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా అభివృద్ధి, మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో అమలవుతున్న పలు పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్‌ మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే రూ.9 కోట్లు అవసరమని, సీఎస్‌ఆర్‌ నిధులతో భవనాలను పూర్తి చేస్తామన్నారు. చెడు అలవాట్లకు బానిసలైన యువతలో మార్పు తెచ్చేందుకు డీఅడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పించాని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి, నర్సీపట్నం ఆస్పత్రులను అభివృద్ధి చేయడంతోపాటు జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో మరో రెండు కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని ఎంపీ చెప్పారు. గ్రామాల్లో నేరాలను అరికట్టేందుకు సీఎస్‌ఆర్‌ నిధులతో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, తాండవ రిజర్వాయర్‌ నుంచి ప్రజలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల అధికారుల ద్వారా ఆయా శాఖల ద్వారా జరగుతున్న అభివృద్ధిని తెలుసుకున్నారు. అనకాపల్లి నుంచి రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారి విస్తరణ, ఇరవైపులా సర్వీసు రోడ్ల నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్‌కుమార్‌, పంచకర్ల రమేశ్‌బాబు, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ జాహ్నవి, ఎస్పీ తుహిన్‌ సిన్హా, జడ్పీ సీఈఓ నారాయణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు

జిల్లా అభివృద్ధి, మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, చోడవరం ఎమ్మెల్యే కేఎ్‌సఎన్‌ఎస్‌ రాజు, ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు హాజరుకాలేదు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లాలో ఐదుగురు వున్నారు. ఆహ్వానాలు అందకపోవడంతో వీరు కూడా సమావేశానికి రాలేదు.

Updated Date - Apr 26 , 2025 | 12:26 AM