Share News

ఆర్‌ఎంహెచ్‌పీ అస్తవ్యస్తం

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:21 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ‘అందితే జుట్టు...అందకపోతే కాళ్లు’ పట్టుకునే చందంగా వ్యవహరిస్తోంది.

ఆర్‌ఎంహెచ్‌పీ అస్తవ్యస్తం

గందరగోళంగా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌

విభాగాలకు దిగజారిన ముడిపదార్థాల సరఫరా

తగ్గిపోతున్న స్టీల్‌ ఉత్పత్తి

రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటులో పనిచేసేందుకు నిపుణులు అంతా ముందుకు రావాలని యాజమాన్యం పిలుపు

విభాగాధిపతులకు కూడా ఆదేశాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు యాజమాన్యం ‘అందితే జుట్టు...అందకపోతే కాళ్లు’ పట్టుకునే చందంగా వ్యవహరిస్తోంది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను హడావిడిగా ప్రారంభించవద్దని, ముందు సంబంధిత విభాగాలన్నింటిలో నిర్వహణ పనులు చేపట్టాలని ఉద్యోగ వర్గాలు నెత్తీనోరు కొట్టుకున్నాయి. అలా చేయని పక్షంలో ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని, ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించాయి. కానీ ఇన్‌చార్జి సీఎండీ సక్సేనా ఎవరి మాటలు పట్టించుకోకుండా జూన్‌ నెలాఖరున బ్లాస్ట్‌ఫర్నేస్‌-3ని ప్రారంభించారు. ప్లాంటులో రోజుకు 21 వేల టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు. అయితే గత రెండు వారాలుగా ఉత్పత్తి సగటున పది వేల టన్నులకు మించడం లేదు. ప్లాంటుకు అతి ముఖ్యమైన రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ)లో సమస్యలు తలెత్తడమే దీనికి ప్రధాన కారణం.

ఆర్‌ఎంహెచ్‌పీలో నైపుణ్యంతో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను తొలగించి, వారి స్థానంలో తక్కువ కూలీకి వచ్చే ఇతర రాష్ట్రాల వారిని పెట్టారు. వారు కన్వేయర్‌ బెల్ట్‌ల నిర్వహణ, ర్యాకుల ట్రిప్లింగ్‌ పనులు చేయలేకపోతున్నారు. దాంతో వివిధ విభాగాలకు తగినంత ముడి పదార్థాలు సరఫరా కావడం లేదు. ఫలితంగా ఉత్పత్తి పడిపోయింది. ఇప్పుడు మేల్కొన్న యాజమాన్యం ‘స్ర్టెంగ్తన్‌ ఆర్‌ఎంహెచ్‌పీ-సపోర్ట్‌ వీఎస్‌పీ’ అంటూ సోమవారం పిలుపునిచ్చింది. ఇది అత్యంత కష్టకాలం అని, ఆర్‌ఎంహెచ్‌పీని సమర్థంగా నడపాలని, 100శాతం ఉత్పత్తి తీయాలని ఉద్యోగ వర్గాలను కోరింది. ఆర్‌ఎంహెచ్‌పీకు వెళ్లి బాగా పనిచేయగల సామర్థ్యం కలిగిన ఉద్యోగులు, వర్కర్లు ఏ విభాగంలో ఉన్నా వెంటనే యుద్ధప్రాతిపదికన అక్కడకు తరలించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. విభాగాధిపతులు అంతా నైపుణ్యం కలిగిన వారిని గుర్తించాలని, వారిని ఈ నెలఖారులోగా ఆర్‌ఎంహెచ్‌పీ జనరల్‌ షిఫ్ట్‌నకు పంపాలని ఆదేశించింది. అక్కడ పనిచేసే వారికి వ్యక్తిగత భద్రతా పరికరాలు (పీపీఈలు) ఇవ్వాలని, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అక్కడ ఏమి జరుగుతున్నదంటే...?

ఆర్‌ఎంహెచ్‌పీకి గూడ్సు రైళ్లు (ర్యాక్‌లు) ద్వారా ఐరన్‌ఓర్‌, బొగ్గు, లైమ్‌ స్టోన్‌ వంటివి వస్తాయి. వాటిని ‘ట్రిప్లింగ్‌’ విధానంలో అన్‌లోడింగ్‌ చేయాలి. వచ్చిన ర్యాక్‌లను ఎనిమిది గంటల్లో ఖాళీ చేసి వెనక్కి పంపాలి. అంతకు మించి ర్యాక్‌లు ఉండిపోతే వాటికి రైల్వే డెమరేజ్‌ చార్జీలు వసూలు చేస్తుంది. కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్‌ వర్కర్లు ట్రిప్లింగ్‌ చేయలేకపోతున్నారు. దాంతో వ్యాగన్ల నుంచి సరుకును మాన్యువల్‌గా అన్‌లోడింగ్‌ చేస్తున్నారు. మనుషులతో అన్‌లోడింగ్‌ చేయించడం వల్ల ఒక్కో ర్యాక్‌ 30 నుంచి 40 గంటలు అక్కడే ఉండిపోతోంది. దాంతో రైల్వేకు డెమరేజ్‌ కింద నెలకు రూ.15 కోట్లు వరకు కడుతున్నారు. అంటే సరకును దించడానికి నెలకు అదనంగా రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. ఇంత చేసినా ముడిపదార్ధాలు ఆయా విభాగాలకు అందడం లేదు. కన్వేయర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆ పనులు కూడా వారు చేయలేకపోతున్నారు. ఎస్‌ఎంఎస్‌ విభాగానికి లైమ్‌ స్టోన్‌ సరఫరా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పనులు కూడా చేయడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని పంపాలని సీఎండీ ఆదేశించారు. చక్కగా పనిచేస్తున్న వారిని అడ్డగోలుగా తొలగించారు. ఇప్పుడు ఉత్పత్తి సాధించలేక చతికిల పడ్డారు. యుద్ధ ప్రాతిపదికన తరలించే ఉద్యోగులను ఎన్నాళ్లు అక్కడ డిప్యుటేషన్‌పై పనిచేయిస్తారు. ఇంకెంత కాలం 12 గంటలు డ్యూటీ చేయిస్తారో యాజమాన్యం ఇప్పుడైనా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీనిపై స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా సీఎండీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Aug 26 , 2025 | 01:21 AM