Share News

పరవళ్లు తొక్కుతున్న నదులు

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:46 PM

జిల్లాలోని శారదా నది, సర్పానది, వరాహా నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనకాపల్లి పట్టణానికి ఆనుకొని ఉన్న శారదానది పరవళ్లు తొక్కుతోంది.

పరవళ్లు తొక్కుతున్న నదులు
నర్సీపట్నంలో వరహానది ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యం

కళకళలాడుతున్న జలాశయాలు

అనకాపల్లి టౌన్‌/మాకవరపాలెం/నర్సీపట్నం/ఎలమంచిలి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని శారదా నది, సర్పానది, వరాహా నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనకాపల్లి పట్టణానికి ఆనుకొని ఉన్న శారదానది పరవళ్లు తొక్కుతోంది. గత రెండు రోజులుగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురవడంతో పాటు పెద్దేరు, కోనాం రిజర్వాయర్ల నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో శారదానదిలో వరదనీటి ప్రవాహం భారీగా పెరిగింది.రెండు రోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్న నీటి ప్రవాహం సోమవారానికి ఉధృతమైంది. మాకవరపాలెం మండలంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు కురుస్తున్న వర్షాలకు సర్పానది, వరహానదితో పాటు జాజిగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గిడుతూరు, మల్లవరం, బయ్యవరం, పైడిపాల, మాకవరపాలెం గ్రామాల్లో పల్లపు పొలాల్లో వరినాట్లు పూర్తిగా నీట మునిగాయి. నర్సీపట్నం ఉత్తర వాహిని వద్ద వరహానది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెదబొడ్డేపల్లి, ధర్మసాగరం, నర్సీపట్నం పెద్ద చెరువు, దుగ్గాడ రామన్నచెరువులలో పొర్లుకట్టు నుంచి వరద ప్రవహిస్తున్నాయి. నర్సీపట్నం మండలం కృష్ణాపురం సమీపం, బలిఘట్టం, పెదబొడ్డేపల్లిలో వరి పొలాల్లోకి వరద నీరు చేరింది. నర్సీపట్నం మండలంలో 26 ఎకరాలు వరద ప్రభావానికి గురైనట్టు అధికారులు గుర్తించారు. భారీ వర్షాలకు ఎలమంచిలి మండలంలో మైనర్‌ శారదా, వరహా నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది.

Updated Date - Aug 18 , 2025 | 11:46 PM