పెరుగుతున్న కాలుష్యం
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:31 AM
నగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది.
నగరంలో క్షీణిస్తున్న గాలి నాణ్యత
పరిమితికి మంచి పీఎం 10, 2.5 నమోదు
శీతాకాలం ముగిసేంత వరకూ ఇదే పరిస్థితి
ఇకపై ప్రతి వారం గాలి నాణ్యతపై బులెటిన్లు: పీసీబీ ఈఈ
విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
నగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. శీతాకాలం ప్రారంభం నుంచే కాలుష్యం పెరగడంతో గాలిలో స్వచ్ఛత తగ్గుతోంది. మరీ ముఖ్యంగా గడచిన పది రోజుల నుంచి అయితే మరింత ఆందోళన కలిగిస్తోంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంపై ఉన్న ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్‌లో నమోదైన వివరాలు పరిశీలిస్తే...గాలి నాణ్యత ప్రమాణాలు ఆరోగ్యంపై ప్రభావం చూపేలా ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 సగటున 295 (ఎంజీ ఫర్ మిలియన్ క్యూబిక్ మీటరు), పీఎం 10...అయితే 183గా, నైట్రోజన్ ఆక్సైడ్-2...54గా నమోదయ్యాయి. అదే శనివారం పీఎం 2.5..194, పీఎం 10 అయితే 220, నైట్రోజన్ ఆక్సైడ్ 105, శుక్రవారం పీఎం 2.5...201, పీఎం 10 అయితే 236, నైట్రోజన్ ఆక్సైడ్ 110గా నమోదయ్యాయి. ఈ విధంగా ఈ నెల మూడో తేదీ నుంచి నగరంలో కాలుష్యం పెరగడంతో పీఎం 2.5, పీఎం 10, ఎన్‌వో-2 క్రమేపీ పైపైకి వెళుతున్నాయి.
విశాఖ నగరం బౌల్ ఏరియాగా ఉంటుంది. అంటే మూడు వైపుల కొండలు, తూర్పున సముద్రం ఉంటుంది. శీతాకాలంలో గాలులు తక్కువగా ఉండడంతో కాలుష్య కారకాలు బయటకు వెళ్లడానికి వీలులేకుండా ఇక్కడే సెటిల్ అవుతుంటాయి. దీనివల్ల కాలుష్య కారకాల ఇండెక్స్‌లు పరిమితికి మించి నమోదవుతున్నాయి. నగరంలో లక్షలాది వాహనాలు ఉన్నాయి. వాటిలో భారీ వాహనాలు, కాలం చెల్లిన వాహనాల నుంచి విడుదలయ్యే పొగ కాలుష్యం తీవ్రతను పెంచుతుంది. ఇంకా విశాఖ పోర్టు నుంచి బొగ్గు ధూళి, ఇతర సరుకు ఎగుమతి/దిగుమతి, రవాణా సమయంలో వెలువడే కాలుష్యం ప్రమాద స్థాయిలో నమోదవుతుంది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ పలుమార్లు హెచ్చరించినా, జరిమానా విధించినా పోర్టు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. బొగ్గు రవాణా నగరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలుష్యం పెరగడంతో గాలి నాణ్యత క్షీణించి, శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సమస్య బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది.
కాగా సుమారు 600 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన విశాఖ నగరంలో ఒక్క ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్ ఏర్పాటుచేశారు. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో కనీసం మరో నాలుగు ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్లు ఏర్పాటుచేయాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు ఇప్పటివరకూ అతీగతీ లేదు. దాంతో నగరంలో పలుచోట్ల మాన్యువల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్లు ద్వారానే కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యం, గాలి నాణ్యతను నమోదుచేస్తోంది. నగరంలో గాలి నాణ్యత క్షీణిస్తుండడంతో ఇక నుంచి ప్రతి వారం బులెటిన్లు ఇవ్వనున్నట్టు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ పి.ముకుందరావు తెలిపారు. మాన్యువల్‌గా వారం రోజులపాటు నమోదుచేసిన వాటి వివరాలతో బులెటిన్‌లో పొందుపరుచతామన్నారు. నగరంలో ఆన్‌లైన్ మిషన్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంపై మాత్రమే ఉందని, అందువల్ల మాన్యువల్ మిషన్ల ద్వారా వచ్చే గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుని బులెటిన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
పీఎం 2.5, పీఎం 10 అంటే....
గాలిలో సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు ఎంతో ప్రమాదకరమైనవి. ముక్కు ద్వారా లోనికి వెళ్లే ధూళి కణాల్లో పీఎం 2.5, పీఎం 10...అనేవి ప్రధానమైనవి.
పీఎం 2.5: గరిష్ఠ వ్యాసార్థం 2.5 మైక్రో మీటర్లు ఉంటుంది. అంటే క్యూబిక్ మీటరులో 2.5 మైక్రోగ్రాములన్నమాట. ఇది కంటికి కనిపించదు. అత్యంత సూక్ష్మమైనది. మనిషి ప్రమేయం లేకుండా గాలి పీల్చుకునే సమయంలో నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి అక్కడ నుంచి రక్త ప్రవాహంలోకి చొచ్చుకుపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి.
పీఎం 10: ఒక క్యూబిక్ మీటరులో 10 మైక్రోగ్రాములన్నమాట. ఇది కూడా సూక్ష్మమైన ధూళి కణమే. ఇవి శ్వాస పీల్చుకునే సమయంలో నాసికారంధ్రం వద్ద ఉండిపోతాయి. ఒక్కొక్కసారి గాలితో పాటు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతాయి. నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ప్రమాదకరమైన వాయువే. ఇది కూడా పరిమితికి మించి నమోదైతే గాలిలో స్వచ్ఛత తగ్గి మనుషులపై ప్రభావం చూపుతాయి.
కొనసాగిన చలి, మంచు
విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
నగరంలో చలి తీవ్రత సోమవారం కూడా కొనసాగింది. చలికి తోడుగా దట్టంగా మంచు కురిసింది. పొరుగునున్న ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో మంచు ప్రభావంతో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. ఆ ప్రభావం విశాఖ నగరంతోపాటు శివారు ప్రాంతాలపై పడింది. సోమవారం ఉదయం మంచు కురవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు చలి తీవ్రత కొనసాగింది.