మహిళల్లో పెరుగుతున్న బీపీ, షుగర్
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:18 AM
అనారోగ్యం బారినపడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.
స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ వైద్య శిబిరాల్లో గుర్తింపు
మూడొంతుల మందిలో సమస్యలు
13,902 మందిలో 10,281 మందికి హైబీపీ
14,700 మందిలో 10,018 మందికి షుగర్
విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):
అనారోగ్యం బారినపడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. పనిభారం, ఆర్థిక, ఇతర సమస్యల కారణంగా మహిళలు తీవ్ర ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా ప్రత్యేకంగా నిర్వహించిన వైద్య శిబిరాల్లో ఈ విషయాన్ని గుర్తించారు. వైద్య శిబిరాలకు వచ్చిన మహిళల్లో ఎక్కువ మంది బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది.
గత నెల 17 నుంచి ఈ నెల రెండో తేదీ వరకు జిల్లాలోని 66 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు కలిపి 139 చోట్ల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేశాయి. వీటికి 33,913 మంది మహిళలు హాజరయ్యారు. అందులో 13,902 మంది బీపీ పరీక్ష చేయించుకోగా, 10,281 మంది హైబీపీతో బాధపడుతున్నట్టు తేలింది. అలాగే 14,700 మందికి పరీక్ష చేయగా, 10,018 మందికి షుగర్ ఉన్నట్టు నిర్ధారించారు. వారికి ఇప్పటివరకూ షుగర్ ఉన్నట్టు తెలియకపోవడం గమనార్హం. అలాగే 18,046 మందికి యాంటీనేటల్ చెకప్ (గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవానికి ముందు వరకూ చేసే పరీక్షలు), 8,446 మందికి హిమోగ్లోబిన్, 3,069 మందికి సర్వైకల్ క్యాన్సర్, 5,218 మందికి నోటి క్యాన్సర్, 7,161 మందికి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. మరో 181 మందికి సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలను నిర్వహించారు. కొంతమంది మహిళలకు మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ తరువాత వైద్య సేవలను అందిస్తామని అధికారులు వెల్లడించారు.