పక్వానికి చెరకు తోటలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:39 AM
జిల్లాలో చెరకు తోటలు పక్వానికి వచ్చినందున వాటిని నరికి బెల్లం తయారీకి లేదంటే షుగర్ ఫ్యాక్టరీలకు తరలించుకోవచ్చని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడిన ఆమె.. చెరకు తోటల పక్వదశ, సుక్రోజ్ శాతం నిర్ధారణ, చెరకు కటింగ్, తదితర అంశాల గురించి వివరించారు.
సక్రోజ్ 16 శాతం దాటితే లాభసాటిగా బెల్లం/ పంచదార తయారీ
రిఫ్రాక్టోమీటర్‌తో నిర్ధారణ
డాక్టర్ డి.ఆదిలక్ష్మి, చెరకు ప్రధాన శాస్త్రవేత్త
అనకాపల్లి అగ్రికల్చర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెరకు తోటలు పక్వానికి వచ్చినందున వాటిని నరికి బెల్లం తయారీకి లేదంటే షుగర్ ఫ్యాక్టరీలకు తరలించుకోవచ్చని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడిన ఆమె.. చెరకు తోటల పక్వదశ, సుక్రోజ్ శాతం నిర్ధారణ, చెరకు కటింగ్, తదితర అంశాల గురించి వివరించారు.
పక్వానికి చెరకులో సుక్రోజు శాతం అధికంగా ఉండి బెల్లం లేదా చక్కెర తయారీ లాభసాటిగా ఉంటుంది. రిఫ్రాక్టోమీటర్‌ను ఉపయోగించి పలుచోట్ల చెరకు తోటల్లో సుక్రోజును పరిశీలించగా 17 నుంచి 18 శాతం వరకు వుంది. సాధారణంగా సుక్రోజు 16 శాతం ఉంటే చెరకు తోటను నరికి గానుగాడించుకోవచ్చు. అయితే చెరకు తోటలను నరికేముందు పక్వ నిర్ధారణ తప్పనిసిరి. చక్కెర శాతంతోపాటు, రసశుద్ధి శాతం 85 నుంచి 90కి చేరితే చెరకు తోటలు నరికేందుకు అనుకూలంగా ఉంటాయి. చెరకు దిగుబడి ఎన్ని టన్నులు వచ్చిందన్న దానిపైనే రైతులకు ఆదాయం ఆధారపడి వుంటుంది. అదే షుగర్ ఫ్యాక్టరీల విషయానికి వస్తే సుక్రోజు శాతంపై ఆధారపడి ఉంటుంది. చెరకు దిగుబడి, సుక్రోజు శాతం.. రెండింటినీ సమన్వయ పరచుకొని చెరకు క్రషింగ్ చేపడితే లాభసాటిగగా ఉంటుంది.
రైతుస్థాయిలో పక్వదశ పరీక్ష
రైతులు చెరకు పక్వదశను తోటల వయస్సు, ఇతర లక్షణాలపై ఆధారపడి నిర్ధారిస్తారు. సాధారణంగా చెరకు విత్తనం నాటిన 9-10 నెలలకు పంట పక్వానికి వస్తుంది. చెరకు ఆకులు పసుపు రంగులోకి మారడమే ఇందుకు సూచిక. కొత్తగా మొవ్వు ఆకులు వేయడం ఆగి పోతుంది. గడల చివర కణుపులు దగ్గరగా ఏర్పడి ఆకులు కుచ్చుగా కనిపిస్తాయి. కొన్ని రకాల్లో పూత వస్తుంది. పూతకు వచ్చిన రకాలను వెంటనే నరికి గానుగాడుకోవాలి. లేదా షుగర్ ఫ్యాక్టరీకి తరలించాలి. చెరకు గడల పైభాగంలో, మొదలు భాగంలో తీపి ఒకేలా ఉన్నప్పుడు దానిని ముదిరిన చెరకు తోటగా చెప్పవచ్చు. నిర్ధారణ మరింత కచ్చితంగా చెప్పాలంటే.. చెరకు గడను రెండు ముక్కలుగా నరికి, వేరువేరుగా గానుగాడి పైభాగం, కింది భాగం రసంలోని తీయదనం ఇంచుమించు ఒకే రకంగా ఉన్నప్పుడు ఆ చెరకు తోట పక్వానికి వచ్చినదని చెప్పవచ్చు. బెల్లం రైతులు తమ అనుభవంతో ఇలాంటి అంచనాల ద్వారా పక్వతను నిర్ణయిస్తారు. షుగర్ ఫ్యాక్టరీలు పక్వత సర్వే జరిపి తోటల కటింగుకు అనుమతులిస్తాయి.
రిఫ్రాక్టోమీటర్‌తో నిర్ధారణ
చెరకు గడల్లో నుంచి కొన్ని చుక్కల రసాన్ని తీసి రిఫ్రాక్టోమీటర్‌తో పరిశీలించి రసంలోని చక్కెర ఘన పదార్థ పరిమాణాన్ని బ్రిక్స్ శాతంగా పేర్కొంటారు ఈ శాతం ఎక్కువగా ఉన్న తోటలను ముందుగాను, తక్కువ ఉన్న తోటలను తరువాత నరికేందుకు షుగర్ ఫ్యాక్టరీలు అనుమతులు ఇస్తాయి. నవంబరు నెలలో పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం అధికంగా ఉంటుంది. చల్లని పొడి వాతావరణాన్నిబట్టి చెరకు గడల్లో చక్కెర శాతం మారుతూ ఉంటుంది. రిఫ్రాక్టోమీటర్ ధర రూ.2 వేలు ఉంటుంది. దీనిని ఉపయోగించి చెరకు పక్వత నిర్ధారణ పరీక్షలు చేయడంలో రైతులకు తర్ఫీదు ఇవ్వడం అవసరం.