Share News

ఇంటిపై హక్కు

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:58 AM

గ్రామ కంఠాల్లో వారసత్వంగా వస్తున్న ఇళ్లలో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించాలన్న బృహత్తర ప్రాజెక్టు సర్వే జోరుగా సాగుతోంది.

ఇంటిపై హక్కు

వారసత్వ గృహాలకు ప్రాపర్టీ కార్డులు

క్రయవిక్రయాలకు అవకాశం

బ్యాంకు రుణాలు తీసుకునే వీలు

జిల్లాలోని 22 గ్రామాల్లో ‘స్వామిత్ర’ సర్వేపూర్తి

మిగిలిన గ్రామాల్లో కొనసాగుతున్న ప్రక్రియ

విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):

గ్రామ కంఠాల్లో వారసత్వంగా వస్తున్న ఇళ్లలో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించాలన్న బృహత్తర ప్రాజెక్టు సర్వే జోరుగా సాగుతోంది. గ్రామాల్లో నివాసాలు, ప్రభుత్వ నిర్మాణాలు (పాఠశాల/అంగన్‌వాడీ /పంచాయతీ/ఇతర భవనాలు) ఉమ్మడి స్థలాలను సర్వేచేసి అఽధికారికంగా రికార్డుల్లో నమోదుచేయడానికి కేంద్రం ప్రారంభించిన ‘స్వామిత్ర’ ప్రాజెక్టును జిల్లాలో మూడు విడతలుగా చేపట్టారు. ఇప్పటివరకు 22 గ్రామాల్లో సర్వే చేయగా, మూడోవిడత మిగిలిన గ్రామాల్లో కొనసాగుతుంది.

గ్రామాల్లో తరతరాల క్రితం నిర్మించిన ఇళ్లకు ఇప్పటివరకు పక్కా రికార్డులు లేవు. వారసత్వంగా నివాసం ఉండడమే తప్ప రెవెన్యూ రికార్డుల్లో ఎవరిపేరు ఉండదు. అధికారికంగా రిజిస్ట్రేషన్‌ శాఖలో క్రయ విక్రయాలకు ఆస్కారంలేదు. గ్రామం మొత్తం గ్రామ కంఠంగా పరిగణిస్తారు. సాగుభూములకు మాత్రమే రికార్డులు ఉంటాయి. గ్రామ కంఠంలో ఖాళీ స్థలాలు చాలా వరకు ఆక్రమణలకు గురికావడంతో అనేకచోట్ల వివాదాలు రేగుతున్నాయి. చివరకు కొన్ని కుటుంబాలు పాత ఇంటి స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టి, బ్యాంకు రుణాలు కోరితే డాక్యుమెంట్లు అడుగుతున్నారు. దీంతో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గ్రామ కంఠాల్లో ఉన్న ఇళ్లు, నిర్మాణాలు, ఖాళీ స్థలాలు, గ్రామం మొత్తం ఉమ్మడి అవసరాలకు సంబంధించిన స్థలాలను గుర్తించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజలు నివసించే ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పించేలా స్వామిత్ర ప్రాజెక్టు అమలుచేసింది.

జిల్లాలో 79 గ్రామ పంచాయతీల పరిధిలో 85 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో వి.తాళ్లవలస, కృష్ణాపురం, పద్మనాభం, ముచ్చెర్ల, నారాయణరాజుపేట అన్‌సెటిల్‌ గ్రామాలు. ఈ గ్రామాలను స్వామిత్ర సర్వే నుంచి తప్పించారు. నిడిగట్టు, రామయోగి అగ్రహారం జీవీఎంసీలో విలీనం చేశారు. జానకిదేవిపేటలో ఇళ్లులేవు. మిగిలిన గ్రామాల్లో తొలి విడత 20 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి 7,554 ఇళ్లకు ప్రాపర్టీ కార్డులు (ఆస్తి యాజమాన్య ధువ్రీకరణ పత్రం) జారీచేశారు. రెండోవిడత 13 గ్రామాలకు గాను రెండింట సర్వే పూర్తయింది. మొత్తం 9,973 ప్రాపర్టీ కార్డులు సిద్ధంచేస్తున్నారు. మిగిలిన 44 గ్రామాల్లో సర్వేచేసిన తరువాత 53,433 ఇళ్లకు ప్రాపర్టీ కార్డులు జారీచేయనున్నారు. తొలివిడలతో సర్వేపూర్తిచేసిన 20 గ్రామాలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రతి గ్రామంలోని ఇళ్లు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భవనాలతోపాటు ఎవరూ క్లైమ్‌చేయని ప్రాపర్టీలను గుర్తించారు. డ్రోన్‌ సాయంతో ఆస్తుల వివరాలు సేకరించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రతి ఆస్తికి పార్సిల్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారు. ప్రతి ఇంటి పొడవు, వెడల్పులను రికార్డులో నమోదుచేస్తున్నారు. ప్రాపర్టీకార్డులు జారీచేసే క్రమంలో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. స్వామిత్ర ప్రాజెక్టు ద్వారా ప్రాపర్టీకార్డులు అందుకున్న ఇళ్ల యజమానులు తమ ఆస్తులను అధికారికంగా విక్రయించుకోవచ్చునని, బ్యాంకు రుణాలు పొందడం, వారసులకు బదలాయింపు వంటి హక్కులు దఖలు పడతాయని తెలిపారు.

Updated Date - Nov 03 , 2025 | 12:58 AM