విజయశ్రీ బ్లడ్ సెంటర్‌పై కొరడా
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:56 AM
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విజయశ్రీ బ్లడ్ సెంటర్‌పై ఔషధ నియంత్రణ, పరిపాలనా విభాగం అధికారులు కొరడా ఝుళిపించారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుండడంతో ఉన్నతాధికారుల చర్య
ఔషధ నియంత్రణ, పరిపాలన విభాగం తనిఖీల్లో లొసుగులు బహిర్గతం
అర్హులైన సిబ్బంది లేకపోవడంతోపాటు రక్తాన్ని శుద్ధి చేయడంలో తగిన ప్రమాణాలు పాటించడం లేదని గుర్తింపు
విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విజయశ్రీ బ్లడ్ సెంటర్‌పై ఔషధ నియంత్రణ, పరిపాలనా విభాగం అధికారులు కొరడా ఝుళిపించారు. రక్తాన్ని శుద్ధి చేయడంలో ప్రమాణాలు పాటించకపోవడం, అర్హులైన సిబ్బంది లేకపోవడం, అనుమతి లేకుండా పరికరాలను మరోచోటకు తరలించడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణిస్తూ సెంటర్‌ను మూసివేయించాల్సిందిగా రాష్ట్ర ఔషధ నియంత్రణ, పరిపాలనా విభాగం డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు మూడు నెలల కిందట రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకుల్లో ఔషధ నియంత్రణ, పరిపాలనా విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మహారాణిపేటలోని విజయశ్రీ బ్లడ్ సెంటర్‌కు వెళ్లిన అధికారులకు అక్కడి పరిస్థితులను చూసి కళ్లు బైర్లు కమ్మాయి. సాధారణంగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించాలంటే తప్పనిసరిగా మెడికల్ ఆఫీసర్, టెక్నీషియన్, స్టాఫ్ నర్సు ఉండాలి. అయితే, విజయశ్రీ సెంటర్‌లో టెక్నీషియన్ తప్ప ఎవరూ లేరు. అలాగే, రక్తాన్ని శుద్ధి చేసే పరికరాలను అధికారులకు సమాచారం ఇవ్వకుండానే మరోచోటకు తరలించినట్టు, రక్తాన్ని సేకరించేటప్పుడు రక్తదాతకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని తీసుకోవడం లేదని గుర్తించారు. రక్తదాత నుంచి రక్తాన్ని సేకరించిన సమయంలో గానీ, తరువాత గానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రాథమిక చికిత్స అందించే పరిస్థితి అక్కడ లేదు. ఈ సెంటర్‌లో లోపాలను గుర్తించి సమాధానం ఇవ్వాలని కోరుతూ మూడు నెలల కిందట అధికారులు నోటీసులు జారీచేశారు. నెలలు గడిచినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడంతో గత నెలలో మరోసారి తనిఖీలు నిర్వహించారు. అప్పటికీ అదే పరిస్థితి కొనసాగడంతో ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. దానిని ఆధారంగా చేసుకున్న ఔషధ నియంత్రణ, పరిపాలన విభాగం డైరెక్టర్ బ్లడ్ సెంటర్‌ను మూసేయాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఔషధ నియంత్రణ, పరిపాలనా విభాగం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది సహాయంతో సెంటర్‌ను క్లోజ్ చేశారు.