Share News

రిచా ఘోష్‌ మెరుపు ఇన్నింగ్స్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:25 AM

భారత వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌, దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డీ క్లెర్క్‌ బ్యాటింగ్‌ మెరుపులతో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం హోరెత్తింది.

రిచా ఘోష్‌ మెరుపు ఇన్నింగ్స్‌

  • బ్యాటుతో ఆకట్టుకున్న భారత వికెట్‌ కీపర్‌

  • అయినా దక్కని విజయం

  • ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలుపు

  • వీరోచిత బ్యాటింగ్‌తో అదరగొట్టిన డీ క్లెర్క్‌

విశాఖపట్నం, స్పోర్ట్స్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):

భారత వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌, దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డీ క్లెర్క్‌ బ్యాటింగ్‌ మెరుపులతో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం హోరెత్తింది. వన్డే మ్యాచ్‌ కాస్త టీ20 మాదిరిగా సాగింది. అయితే ఆతిథ్య జట్టు ఓటమి పాలుకావడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

మహిళల వన్డే ప్రపంచ కప్‌ టోర్నీలో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మూడు వికెట్ల తేడాతో ఓటమి చెందింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో 251 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతికా రావల్‌ (37), స్మృతి మంధానా (23) శుభారంభం ఇచ్చినా మిడిల్‌ ఆర్డర్‌ ఫెూరంగా విఫలమైంది. హర్లీన్‌ డియోల్‌ (13), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (9) సహా పలువురు తక్కువ స్కోరుకే అవుటయ్యారు.

రెచ్చిపోయిన రిచా ఘోష్‌

టాప్‌ ఆర్డర్‌ పెవెలియన్‌ దారిపట్టిన సమయంలో ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్‌ రెచ్చిపోయి దక్షిణాఫ్రికా బౌలర్ల భరతం పట్టింది. 150 పరుగులు చేయడమే కష్టమనుకున్న సమయంలో రిచా ఘోష్‌ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి స్కోరు బోర్డును పరిగెత్తించింది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచి సఫారీ బౌలర్లపై దాడికి దిగింది. దక్షిణాఫ్రికా సారధి లౌరా ఎప్పటికప్పుడు బౌలర్లను మార్చినా రిచాను నిలువరించడంలో సఫలం కాలేదు. ప్రతి ఓవర్‌లో కనీసం ఒక బౌండరీ బాది భారత్‌ శిబిరానికి ఉత్సాహానిచ్చింది. 43.5వ ఓవర్‌లో డి క్లెర్క్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 53 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీతో (50) పూర్తిచేసింది. రిచాకు స్నేహ రానా తోడైంది. ఇద్దరూ కలిసి సఫారీ బౌలర్లకు చుక్కలు చూపారు. కేవలం 36 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్ధ సెంచరీ తర్వాత మరింత మరింత రెచ్చిపోయిన రిచా ఘోష్‌ 46 ఓవర్లలో ఖాకా బౌలింగ్‌లో రెండు బౌండరీలు, ఇక సిక్సర్‌ బాదింది. భారత్‌ స్కోరు 251 చేరడానికి రిచా ఘాష్‌కు స్నేహ రానా అద్బుతమైన తోడ్పాటునిచ్చింది. రిచాతోపాటు రానా కూడా బంతులను బౌండరీలకు తరలిస్తూ సఫారీ బౌలర్లకు చెమటలు పట్టించింది. 42 ఓవర్‌లో మ్లాబా బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టింది. మరోవైపు రిచా ఘోష్‌ సెంచరీకి చేరువవుతున్న సమయంలో ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. వ్యక్తిగత స్కోరు 94 పరుగుల వద్ద అవుటైన రిచాను ప్రేక్షకులు నిలబడి హర్షధ్వానాలతో అభినందనలు తెలపడం ఆకట్టుకున్నది.

లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లౌరా హాఫ్‌ సెంచరీతో (70) రాణించగా 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన డీ క్లెర్క్‌ 54 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో (84 నాటౌట్‌) చెలరేగింది. 47 ఓవర్లో క్రాంతి గౌడ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాది మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేసింది. 49వ ఓవర్లో అమన్‌జోత్‌ కౌర్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది విజయానికి అవసరమైన 12 పరుగులను సాధించి దక్షిణాఫ్రికా జట్టుకు అనూహ్య విజయాన్నందించింది.

Updated Date - Oct 10 , 2025 | 01:25 AM