Share News

పోలీసుల అదుపులో బియ్యం లారీలు

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:03 AM

తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నానికి రవాణా అవుతున్న రెండు బియ్యం లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు వచ్చి బియ్యం నమూనాలను సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ల్యాబ్‌కు పంపుతామని, వచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు వుంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

పోలీసుల అదుపులో బియ్యం లారీలు
లారీలో నుంచి బియ్యం శాంపిళ్లు తీయిస్తున్న పౌరసరఫరాల శాఖ డీటీ సోమశేఖర్‌

రాజానగరం నుంచి విశాఖకు రవాణా

ఎలమంచిలి వద్ద యర్రవరంలో ఆగడంతో పోలీసులకు సమాచారం

సిబ్బందితో వెళ్లి పరిశీలించిన ఎస్‌ఐ

పౌరసరఫరాల శాఖకు వర్తమానం

డీటీ వచ్చి బియ్యం శాంపిళ్లు సేకరణ

పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలింపు

నివేదికనుబట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడి

ఎలమంచిలి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నానికి రవాణా అవుతున్న రెండు బియ్యం లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు వచ్చి బియ్యం నమూనాలను సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ల్యాబ్‌కు పంపుతామని, వచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు వుంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

ఎలమంచిలి పట్టణ పరిధిలోని యర్రవరం సమీపంలోని పెట్రోలు బంకు వద్ద బియ్యం లోడుతో ఉన్న రెండు లారీలు వున్నట్టు గురువారం ఉదయం పట్టణ పోలీసులకు సమాచారం వచ్చింది. పట్టణ ఎస్‌ఐ సావిత్రి, సిబ్బందితో అక్కడకు వెళ్లి లారీలను తనిఖీ చేశారు. డ్రైవర్ల వద్ద వున్న వే బిల్లులను పరిశీలించగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నుంచి విశాఖ నగరానికి రవాణా చేస్తున్నట్టుగా వుంది. ఒక్కో లారీలో సుమారు 15 టన్నుల బియ్యం వున్నాయి. అయితే ఇవి రేషన్‌ బియ్యమా? లేకపోతే సాధారణ బియ్యమా? అన్న అనుమానం రావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం ఎలమంచిలి పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారు పి.సోమశేఖర్‌ వచ్చి, ఒక్కో లారీలో మూడు చొప్పున.. రెండు లారీల్లో నుంచి ఆరు బియ్యం శాంపిళ్లను సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతామని, ఇవి ఏ రకం బియ్యమో ల్యాబ్‌ నుంచి నివేదిక వస్తుందని చెప్పారు. దీని ఆధారంగా తదుపరి చర్యలు వుంటాయని ఆయన పేర్కొన్నారు. బియ్యం లారీలను పోలీసుల పర్యవేక్షణలో పెట్రోలు బంకు వద్దనే ఉంచారు.

Updated Date - Jun 13 , 2025 | 01:03 AM