చెరువుల్లా వరి పొలాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:32 AM
మండలంలోని చాలా గ్రామాల్లో పంట పొలాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. మండలంలోని చాకిపల్లి, కన్నంపాలెం, జన్నవరం, పీఎస్‌పేట, అంకుపాలెం, నరసయ్యపేట, తదితర పంచాయతీల్లోని పంట పొలాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి.
వర్షాలు తగ్గినా ఇంకా నీటి ముంపులోనే..
పెద్దేరు నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ పరిస్థితి
చోడవరం, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చాలా గ్రామాల్లో పంట పొలాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. మండలంలోని చాకిపల్లి, కన్నంపాలెం, జన్నవరం, పీఎస్‌పేట, అంకుపాలెం, నరసయ్యపేట, తదితర పంచాయతీల్లోని పంట పొలాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లోకి భారీగా నీరు చేరిన సంగతి తెలిసిందే. భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో పెద్దేరు ఉధృతి పెరిగింది. దీంతో మండలంలోని చాకిపల్లి, రామజోగిపాలెం, కన్నంపాలెం, జన్నవరం, పీఎస్‌పేట, భోగాపురం, తదితర పంచాయతీల్లోని పంట పొలాలు పూర్తిగా నీటి ముంపునకు గురయ్యాయి. ఇప్పటికే ఆకు మడులు వేసిన పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. కన్నంపాలెంలో వేసిన చెరకు తోటలు కూడా ఇంకా నీటిముంపులోనే ఉన్నాయి. పెద్దేరు నదిలో ఉధృతి తగ్గితే తప్ప, ఈ గ్రామాల్లోని నీరు తగ్గే పరిస్థితి లేకపోవడంతో పంట పొలాలు చెరువులను తలపించే విధంగా ఉన్నాయి. కాగా కన్నంపాలెం, చాకిపల్లి ప్రాంతాల్లో వరి ఆకుమడులతో పాటు, ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాలు సైతం నీట మునిగిపోవడంతో వరినారు కుళ్లిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.