బియ్యం, కందిపప్పు ధరలు తగ్గుముఖం
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:27 AM
మార్కెట్‌లో బియ్యం, కందిపప్పు ధరలు దిగి వచ్చాయి.

26 కిలోల బస్తా హోల్‌సేల్‌లో రూ.1,500
రిటైల్‌లో రూ.1,550
సన్నరకాలు కిలో రూ.44
కందిపప్పు మరింత చౌక...
పూర్ణామార్కెట్‌లో కిలో రూ.110కే విక్రయం
రైతుబజార్లలో ఇంకా రూ.120కే అమ్మకం
ప్రత్యేక దుకాణాలను తొలగించని వర్తకులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మార్కెట్‌లో బియ్యం, కందిపప్పు ధరలు దిగి వచ్చాయి. ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంతకుముందు రూ.1,650 నుంచి రూ.1,700 మధ్య విక్రయించిన టాప్ బ్రాండ్ బియ్యం లలిత, అక్షయ, తదితర రకాలు (26 కిలోలు) ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.1,500కే దొరుకుతున్నాయి. వీధుల్లో రిటైలర్లు రూ.1,550కు అమ్ముతున్నారు.
సన్నరకాలు అంటూ అమ్మిన కొత్త బియ్యం ధర ఇంతకుముందు కిలో రూ.48 నుంచి 56 మధ్య ఉండేది. ఇప్పుడు కిలో రూ.44కి దిగి వచ్చింది. హోల్‌సేల్ మార్కెట్‌లో అయితే వంద కిలోలు రూ.4,100కే ఇస్తున్నారు. వాటిని రిటైలర్లు కిలో రూ.44 చొప్పున ఇస్తున్నారు. ధరలన్నీ నెల రోజుల నుంచి క్రమంగా దిగివస్తున్నా రైతుబజార్లు, రిటైల్ షాపుల్లో మాత్రం తగ్గించి అమ్మడం లేదు. కొత్త రకం బియ్యం ధరలే తగ్గాయని, పాత రకాలు తగ్గలేదని బుకాయిస్తున్నారు.
కందిపప్పు కిలో రూ.110కే
కందిపప్పు ధర గత ఏడాది భారీగా పెరిగిపోయింది. నాణ్యత కలిగిన రకం కిలో రూ.190 వరకు వెళ్లింది. దాంతో ప్రభుత్వం హోల్‌సేల్ డీలర్లతో మాట్లాడి రైతుబజార్లలో వారికి ఉచితంగా దుకాణాలు ఇచ్చి కిలో రూ.120 చొప్పున అక్టోబరు నెల నుంచి అమ్మిస్తోంది. అయితే కంది పప్పు ధర నెల రోజుల క్రితమే తగ్గిపోయింది. హోల్‌సేల్‌లో కిలో రూ.103కి ఇస్తున్నారు. బయట రూ.105 నుంచి రూ.110 మధ్య దొరుకుతోంది. అయితే రైతుబజార్లలో డీలర్ల అసోసియేషన్ పెట్టిన ఉచిత దుకాణాల్లో అదే పప్పు యథా ప్రకారం కిలో రూ.120కి అమ్మి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు గానీ, ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. అదే కందిపప్పు అదే రైతుబజార్లలో పక్కనే ఉన్న డీసీఎంఎస్ దుకాణాల్లో కిలో రూ.110 చొప్పున అమ్ముతున్నారు. వారు నెలకు రూ.30 వేలు అద్దె కడుతున్నారు. రేషన్ డీలర్లు ఉచితంగా స్టాల్ తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ దృష్టిసారించాలని వ్యాపారులు కోరుతున్నారు. అలాగే బియ్యం, ఇతర సరకుల ధరలు తగ్గినందున ఆ ప్రయోజనం వినియోగదారులకు అందేలా చూడాల్సిన అవసరం ఉంది. తక్షణమే నిత్యవసర ధరల మానటరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసి తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంది.