Share News

చెరువులకు పునరుజ్జీవం

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:25 AM

నగరంలో చెరువులన్నీ కనుమరుగైపోయాయి. మురుగునీటి గెడ్డలు సైతం ఆక్రమణకు గురైపోయాయి. వర్షం కురిస్తే వరద ముంచెత్తుతోంది. నీటి పారుదలకు అవకాశం లేకుండాపోయింది. అయితే శివార్లలో ఇంత దారుణ పరిస్థితులు లేవు. ఆక్రమణదారుల కన్ను పడని చెరువులు కొన్ని ఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలని జిల్లా అధికారులు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ముప్పై ఏళ్ల క్రితం పూడుకుపోయిన చెరువులు ఇపుడు నీటితో కళకళలాడుతున్నాయి.

చెరువులకు పునరుజ్జీవం
నీటితో కళకళలాడుతున్న చెరువు

ఏడాది క్రితం వీఎంఆర్‌డీఏ శ్రీకారం

జీవీఎంసీతో కలిసి థాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పనులు

తొలి విడత కాపులుప్పాడ ప్రాంతంలో చెరువులపై దృష్టి

ప్రస్తుతం నీటితో కళకళ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో చెరువులన్నీ కనుమరుగైపోయాయి. మురుగునీటి గెడ్డలు సైతం ఆక్రమణకు గురైపోయాయి. వర్షం కురిస్తే వరద ముంచెత్తుతోంది. నీటి పారుదలకు అవకాశం లేకుండాపోయింది. అయితే శివార్లలో ఇంత దారుణ పరిస్థితులు లేవు. ఆక్రమణదారుల కన్ను పడని చెరువులు కొన్ని ఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలని జిల్లా అధికారులు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ముప్పై ఏళ్ల క్రితం పూడుకుపోయిన చెరువులు ఇపుడు నీటితో కళకళలాడుతున్నాయి.

విశాఖ నగరం విస్తరించిన తరువాత శివార్లలో చెరువులన్నీ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. స్థానిక రైతుల నీటి అవసరాలు తీర్చడానికి, పర్యావరణ సమతుల్యత పెంచి పక్షుల సంఖ్య పెంచడానికి, వలస పక్షులను పూర్వంలా రప్పించడానికి వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌ ఏడాది క్రితం ‘చెరువుల పునరుద్ధరణ’ పథకానికి శ్రీకారం చుట్టారు. వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కలసి ధాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పనులు చేపడతామని చెప్పగా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆమోదించారు. వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ రికార్డులన్నీ సమగ్రంగా పరిశీలించి, ఆక్రమణలకు గురైన చెరువులను వదిలేయగా, ఎటువంటి పనులు చేపట్టకపోవడం వల్ల పూడుకుపోయిన 24 చెరువులు, 17 నీటి కాలువలను గుర్తించారు. సర్వే నంబర్లు, రిమోట్‌ సెన్సింగ్‌, జియో ఇన్‌ఫర్మేషన్‌తో వాటిని గుర్తించారు. గొలుసుకట్టుగా వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించి, వాటిని మూడు కాస్కేడ్‌ (జలపాతాలు)లుగా చేశారు. కాపులుప్పాడ కాస్కేడ్‌లో నాలుగు చెరువులు, రాంపురం కాస్కేడ్‌లో ఏడు చెరువులు, నరవ కాస్కేడ్‌లో ఎనిమిది చెరువులు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.

తొలి విడతగా కాపులుప్పాడ కాస్కేడ్‌లో 15 ఎకరాల పోతివాని చెరువును అభివృద్ధి చేశారు. ఆ తరువాత 12 ఎకరాల్లో బాడవ చెరువు, ఆపై కాపులుప్పాడ సమీపాన 5.5 ఎకరాల్లో దేవరవాణి చెరువు పనులు చేపట్టారు. మొదటి రెండు చెరువులకు పక్కనున్న గెడ్డల ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండగా, దేవరవాణికి ఆ సౌకర్యం లేదు. దాంతో బాడవ చెరువు నుంచి పైపుల ద్వారా దేవరవాణికి నీరు వచ్చేలా చేశారు. ఇప్పుడు ఆ చెరువు నీటితో కళకళలాడుతోంది. ఈ కాస్కేడ్‌లో నాలుగోది కంబాల చెరువు. దానిని కూడా పూర్తిచేసేందుకు పనులు చేపడుతున్నారు. అది కూడా పూర్తయితే చెరువుల పునరుద్ధరణ పథకంలో తొలి దశ ‘కాపులుప్పాడ కాస్కేడ్‌’ రైతులకు అందుబాటులోకి వస్తుంది. ఆ తరువాత దశలో రాంపురం, నరవ కాస్కేడ్‌ పనులు చేపడతారు.

ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు

ఎన్‌.విశ్వనాథన్‌, కమిషనర్‌, వీఎంఆర్‌డీఏ

పూడుకుపోయి, ఆక్రమణలకు గురికాకుండా ఉన్న చెరువులను పునరుద్ధరించడానికే ఈ పథకం చేపట్టాం. ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు. ఒక చెరువు నిండిన తరువాత దాని నుంచి మరో చెరువుకు నీరు వెళుతుంది. దాంతో అన్ని నీటితో కళకళలాడతాయి. వీటిని పునరుద్ధరించడం వల్ల స్థానిక రైతులకు పంటలు పండించుకునే వెసులుబాటు కలుగుతుంది. జీవావరణం ఇంతకు ముందులా పునరుద్ధరణ జరుగుతుంది. ఏడాది కాలంలోనే మొదటి దశ పూర్తిచేయడం సంతోషంగా ఉంది.

Updated Date - Aug 12 , 2025 | 01:25 AM