Share News

అల్లం పంటకు పునరుజ్జీవం

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:22 PM

మన్యంలో అల్లం పంటకు పునరుజ్జీవం ఇచ్చేందుకు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రధానంగా అల్లం సాగు విస్తీర్ణం పడిపోవడానికి కారణమైన దుంపకుళ్లు తెగులు నివారణపై పరిశోధనలు ప్రారంభించారు.

అల్లం పంటకు పునరుజ్జీవం
పరిశోధన స్థానంలో నూతన వంగడాల ప్రయోగాత్మక సాగు

దుంపకుళ్లు నివారణపై పరిశోధనలు ప్రారంభం

మేలి రకం వంగడాలపై హెచ్‌ఆర్‌యూలో అధ్యయనం

ప్రాథమికంగా జాన్‌జింజర్‌ ఎంపిక

సాగు విస్తీర్ణం పెంపునకు శాస్త్రవేత్తల ప్రణాళిక

చింతపల్లి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మన్యంలో అల్లం పంటకు పునరుజ్జీవం ఇచ్చేందుకు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రధానంగా అల్లం సాగు విస్తీర్ణం పడిపోవడానికి కారణమైన దుంపకుళ్లు తెగులు నివారణపై పరిశోధనలు ప్రారంభించారు. అధిక దిగుబడినిచ్చే మేలి రకం వంగడాలను రైతులకు అందించేందుకు ఏడు రకాలపై అధ్యయనం చేస్తున్నారు. ప్రాథమిక ఫలితాల ఆధారంగా జాన్‌జింజర్‌ గిరిజన ప్రాంతానికి అనువైనదిగా గుర్తించారు. మూడేళ్లలో దుంపకుళ్లు తెగుళ్లను జీవ శిలింధ్రం పద్ధతిలో నివారణ, మేలి రకాల వంగడాలు అందుబాటులోకి వస్తాయని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పదేళ్ల క్రితం 25 హెక్టార్లతో అల్లం పంటను గిరిజన రైతులు సాగు చేసేవారు. ప్రధానంగా నాణ్యమైన విత్తనం అందుబాటులో లేక దుంపకుళ్లు సమస్య కారణంగా సాగు విస్తీర్ణం క్రమంగా పడిపోయింది. ప్రస్తుతం ఏజెన్సీ పదకొండు మండలాల్లో కేవలం 700-800 హెక్టార్లలో మాత్రమే అల్లం పంట సాగు జరుగుతుంది. అల్లం పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ పంటను సాగు చేసుకోవడం వలన గిరిజన రైతులకు అధిక ఆదాయం లభిస్తుంది. ఈ మేరకు అల్లం పంటను ప్రోత్సహిస్తూ గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు.

దుంపకుళ్లుపై పరిశోధనలు

గిరిజన ప్రాంత రైతులు అల్లం, పసుపు పంటలో ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్న దుంపకుళ్లు తెగులు నివారించేందుకు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఈ ఏడాది పరిశోధనలు ప్రారంభించారు. గిరిజన ప్రాంత రైతులు అల్లం పంటను సేంద్రీయ పద్ధతిలో సాగు చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా అల్లం పంటను దుంపకుళ్లు తెగులు నాశనం చేస్తోంది. దీంతో రైతులు అల్లం సాగులో ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. కనీసం విత్తనం దక్కని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా రైతులు అల్లం సాగుకు దూరమయ్యారు. దుంపకుళ్లు తెగులును జీవ శిలింధ్రాలు పద్ధతిలో నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ప్రధానంగా దుంపకుళ్లు నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు ఉపయోగపడే బ్యాక్టీరియాతో క్యాప్సుల్‌(గుళిక)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు. ఈ క్యాప్సుల్‌ నీటిలో కలుపుకుని మొక్కలపై పిచికారీ చేసుకుంటే తెగులు నివారించుకోవచ్చు. శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలిస్తే ఆదివాసీ రైతులు అల్లం సాగులో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన దుంపకుళ్లు నివారణకు పరిష్కారం లభిస్తుంది.

మేలి రకం వంగడాలపై అధ్యయనం

గిరిజన రైతులకు మేలి రకం అల్లం వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏడు రకాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. 2022లో స్థానిక శాస్త్రవేత్తలు దేశంలోని పలు రాష్ట్రాల ఉద్యాన పరిశోధన స్థానాల నుంచి మేలి రకం విత్తనాలను దిగుమతి చేసుకున్నారు. జాన్‌జింజర్‌(కేరళ), బోల్డ్‌ గోరుబతాని, బోల్డ్‌ నాడియా(పశ్చిమబెంగాల్‌), బైస్‌(సిక్కిం), గోరుబతాని(పశ్చిమ బెంగాల్‌), పీజీఎస్‌-121, పీజీఎస్‌-95(ఒడిశా) రకాలపై శాస్త్రవేత్తలు పరిశోధన స్థానంలో మూడేళ్లపాటు అధ్యయనం చేశారు. ఈ ఏడు రకాలను నాలుగేళ్లుగా పరిశోధన స్థానంలో ప్రయోగాత్మక సాగు చేపడుతున్నారు.

జాన్‌జింజర్‌ అనుకూలం

నాలుగేళ్ల ప్రయోగాత్మక సాగు ఫలితాల ఆధారంగా గిరిజన ప్రాంత వాతావరణం, నేలలకు కేరళ నుంచి దిగుమతి చేసుకున్న జాన్‌జింజర్‌ అనుకూలంగా ఉందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారు. ఈ రకం అల్లం కొమ్ములు పరిమాణంలో పెద్దవిగాను, పీచు తక్కువగా ఉంటుంది. ఎకరానికి 10-11 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పరిమాణం పెద్దవిగాను, పీచు తక్కువగా ఉండడం వలన ఈ అల్లానికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తుంది.

Updated Date - Aug 26 , 2025 | 11:22 PM