Share News

మాస్టర్‌ ప్లాన్‌-2041పై సమీక్ష

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:51 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌-2041ను పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, అవసరమైన మార్పులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మాస్టర్‌ ప్లాన్‌-2041పై సమీక్ష

  • అవసరమైన మార్పులు చేపట్టేందుకు అధికారుల కసరత్తు

  • ప్రతి అభ్యంతరానికి పక్కాగా సమాధానం

  • ఏడుగురిలో టెక్నికల్‌ కమిటీ నియామకం

  • ప్రజలకు అవగాహన కల్పించే దిశగా యత్నం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌-2041ను పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, అవసరమైన మార్పులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ఈ మాస్టర్‌ ప్లాన్‌లో అనేక తప్పులు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ నాయకుల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు అనుకూలంగా రహదారులను మార్చుకున్నారు. విశాఖ నుంచి భీమిలి మీదుగా భోగాపురం వెళ్లే కోస్టల్‌ కారిడార్‌ను నేరెళ్లవలస వద్ద లోపలకు తీసుకువెళ్లి వైసీపీ నాయకుల భూములకు లబ్ధి కలిగేలా చేసుకున్నారు. భీమిలి పట్టణంలో పురాతన నిర్మాణాలు పోకూడదనే ఉద్దేశంతో అలా చేశామని చెప్పుకున్నారు. భోగాపురం ప్రాంతంలో అయితే చెరువులు, వాగులు మీదుగా మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను ప్రతిపాదించారు. ప్రభుత్వ సంస్థలే నీటి వనరులను కాపాడకపోతే ఎలా? అని విమర్శలు వెల్లువెత్తాయి. వీటిపై అప్పట్లోనే అభ్యంతరాలు స్వీకరించగా 19,460 మంది ఫిర్యాదులు చేశారు. వాటిలో వేళ్లపై లెక్క పెట్టగలిగిన సంఖ్యలోనే దిద్దుబాట్లు చేసి, మిగిలిన వాటిని పక్కన పడేశారు. అత్యధికుల అభ్యంతరాలకు న్యాయం జరగలేదు.

కొత్త ప్రభుత్వం వచ్చాక వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో ఎక్కువగా మాస్టర్‌ప్లాన్‌పైనే ఫిర్యాదులు రావడంతో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకువెళ్లారు. పురపాలక శాఖ మంత్రి నారాయణతో చర్చించి మాస్టర్‌ ప్లాన్‌-2041పై మళ్లీ అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించి ఆ ప్రక్రియ ప్రారంభించారు. అయితే నగరంలో ఏ రహదారులను ఎంత మేరకు విస్తరిస్తున్నారనే విషయం చాలామందికి తెలియదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఆ రంగంలో ఆసక్తి కలిగిన ప్రజా ప్రతినిధులు మాత్రమే పూర్తి వివరాలు తెలుసుకొని వారి పనులు పూర్తి చేసుకోగలిగారు. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి అభ్యంతరాలకు అవకాశం ఇచ్చినందున ఎక్కడెక్కడ ఏయే మార్పులు జరుగుతున్నాయో ప్రజలకు తెలియజేయాలని పలువురు డిమాండ్‌ చేయడంతో వీఎంఆర్‌డీఏ అధికారులు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో జీవీఎంసీ కార్పొరేటర్లకు కూడా ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

పారదర్శకంగా మాస్టర్‌ ప్లాన్‌ మార్పులు

ఎంవీ ప్రణవ్‌గోపాల్‌, ఛైర్మన్‌, వీఎంఆర్‌డీఏ

గత ప్రభుత్వంలో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో తప్పులు అనేకం ఉన్నందునే సవరించడానికి ఈ ప్రక్రియ ప్రారంభించాం. దీనిని 100 శాతం పారదర్శకంగా నిర్వహించి, వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి సమాధానం ఇస్తాం. ఎక్కడా మళ్లీ తప్పులు జరగకుండా చూస్తాం.

ఏడుగురితో టెక్నికల్‌ కమిటీ

వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌-2041పై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి, మార్పులు, చేర్పులు చేయడానికి ప్రభుత్వం సీఆర్‌డీఏ కమిషనర్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో జీవీఎంసీ కమిషనర్‌, డీటీసీపీ డైరెక్టర్‌, ఏయూ ప్రొఫెసర్‌, తదితరులు ఉంటారు.

లైన్‌ విభాగాల మార్పులకూ అవకాశం

శిల్ప, సీయూపీ, వీఎంఆర్‌డీఏ

మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదించిన తరువాత ఈ మూడేళ్లలో రెవెన్యూ అధికారుల రీ సర్వే, ఏపీఐఐసీ కొత్త లేఅవుట్లు, జీవీఎంసీ, ఆర్‌ అండ్‌ బి, రైల్వే, నేషనల్‌ హైవే అథారిటీ తీసుకున్న కొత్త నిర్ణయాలను కూడా పొందుపరుస్తాం.

నగరంలో విస్తరించే రహదారులు

- మద్దిలపాలెం నుంచి ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వరకు ఉన్న రామా టాకీస్‌ రహదారి ప్రస్తుతం 24 మీటర్లు ఉండగా 45 మీటర్లు చేయనున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఇటు ఏయూ క్వార్టర్లు, అటు సీఎంఆర్‌ సెంట్రల్‌, హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌, మసీదు, చాలావరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు పోతాయి.

- డాబాగార్డెన్స్‌లో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పెన్‌ స్కూల్‌ వరకూ రహదారి ప్రస్తుతం 18 మీటర్లు ఉండగా దానిని 30 మీటర్లకు ప్రతిపాదించారు. ఈ పనులు చేపడితే ఆర్‌కే షాపింగ్‌ మాల్‌ నుంచి ఆ చివర ఉన్న షాపింగ్‌ మాల్‌ వరకు సగం సగం పోతాయి.

- సిరిపురంలో దత్‌ఐలెండ్‌ నుంచి ఆశీల్‌మెట్ట జంక్షన్‌ వరకు రహదారి ప్రస్తుతం 24 మీటర్లు ఉండగా దానిని 45 మీటర్లు చేస్తారు. ఈ పనులు చేపడితే ఇటు జీవీఎంసీ కమిషనర్‌ బంగ్లా, అటు సంపత్‌ వినాయక ఆలయం, పలు షాపింగ్‌ మాల్స్‌ పోతాయి. ఈ మార్గంలోనే మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంవీవీ పీక్స్‌ పేరుతో భారీ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం ప్రారంభించి...కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు లెక్కల ప్రకారం తన భూమి పోతుందని పేర్కొంటూ సుమారుగా రూ.70 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లు తీసుకున్నారు. ఇది వివాదాస్పదమైంది.

- జాతీయ రహదారిలో తాటిచెట్లపాలెం జంక్షన్‌ నుంచి రైల్వేస్టేషన్‌ రోడ్డు వరకు ప్రస్తుతం 18 మీటర్లు ఉండగా దానిని 45 మీటర్లకు ౅పంచుతారు. ఈ విస్తరణలో రైల్వే ఆస్తులకు ఎక్కువ నష్టం కలుగుతుంది.

- దసపల్లా హిల్స్‌లో సర్‌ క్యూట్‌ భవనం నుంచి నౌరోజీ రోడ్డు వరకు మార్గం ప్రస్తుతం 12 మీటర్లు ఉండగా దానిని 30 మీటర్లకు ప్రతిపాదించారు. ఈ మార్గంలో రాకపోకలు తక్కువగా ఉన్నా...దసపల్లా భూములు కొట్టేసిన వైసీపీ బ్యాచ్‌ భారీ భవనాల నిర్మాణాలకు అనుకూలంగా మార్పులు చేయించుకున్నారు.

- భీమిలి మండలం దొరతోట రహదారి ప్రస్తుతం 24 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు ఉండగా దానిని డబుల్‌ అంటే 60 మీటర్లకు ప్రతిపాదించారు. ఈ మార్గంలో ఎక్కువ రైతుల భూములు ఉన్నాయి. వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

- రైల్వే ఆస్పత్రి నుంచి రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ వరకు 30 మీటర్ల రహదారిని 45 మీటర్లకు విస్తరిస్తారు. రైల్వే స్టేషన్‌ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని దీనిని ప్రతిపాదించారు.

- అక్కయ్యపాలెం జంక్షన్‌ నుంచి రైల్వే న్యూకాలనీ వరకు 18 మీటర్ల రహదారి ఉండగా దానిని 30 మీటర్లకు పెంచుతారు.

- త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానం మీదుగా మద్దిలపాలెం జంక్షన్‌ వరకు ప్రస్తుతం 18 మీటర్లు ఉండగా దానిని 30 మీటర్లు చేస్తారు.

- చావులమదుం జంక్షన్‌ నుంచి ఎల్‌ఐసీ జంక్షన్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వరకూ ప్రస్తుతం రహదారి 18 నుంచి 24 మీటర్లు ఉండగా దానిని 45 మీటర్లు చేస్తారు.

Updated Date - Jul 02 , 2025 | 12:51 AM