Share News

బలిమెల నీటి వినియోగంపై సమీక్ష

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:23 AM

ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగం, నిర్వహణపై ఇరు రాష్ర్టాల అధికారులు బుధవారం ఒడిశాలోని చిత్రకొండ వోహెచ్‌పీసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
బలిమెల జలాశయం నీటి వినియోగంపై సమావేశమైన ఆంధ్ర, ఒడిశా అధికారులు

బలిమెల, జోలాపుట్టులో నీటి నిల్వలు 112.9451 టీఎంసీలు

ఏపీ వాటా 69.0803, ఒడిశాకు 43.8648 టీఎంసీలుగా పంపకం

సీలేరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగం, నిర్వహణపై ఇరు రాష్ర్టాల అధికారులు బుధవారం ఒడిశాలోని చిత్రకొండ వోహెచ్‌పీసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025- 2026 నీటి సంవత్సరానికి సంబంధించి 2025 జూలై నుంచి నవంబరు 30 వరకు ఏ రాష్ట్రం తమ వాటాగా ఎన్ని టీఎంసీల నీటిని వినియోగించుకుందో లెక్కలు కట్టారు. దీని ప్రకారం ఆంధ్ర ఇప్పటి వరకు తన వాటాగా 20.3513 టీఎంసీల నీటిని వినియోగించుకుందని, ఒడిశా 45.5667 టీఎంసీలు వినియోగించుకున్నట్టు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఒడిశా, ఆంధ్రా కంటే 25.2154 టీఎంసీలను అధికంగా వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 78.4000 టీఎంసీలు, జోలాపుట్టులో 28.5451 టీఎంసీలు కలిసి మొత్తంగా 106.9451 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని గుర్తించారు. ఈ నెలాఖరు నాటికి బలిమెల జలాశయం పరివాహక ప్రాంతం నుంచి 3.5000 టీఎంసీలు, జోలాపుట్టుకు 2.5000 టీఎంసీలు పరివాహక ప్రాంతాల నుంచి వచ్చి చేరతాయని, వీటితో కలిపి రెండు జలాశయాల్లో మొత్తంగా 112.9451 టీఎంసీలు నిల్వలు ఉన్నట్టు లెక్కలు కట్టారు. ఇందులో ఆంధ్రా వాటా 69.0803 టీఎంసీలు, ఒడిశా వాటాగా 43.8648 టీఎంసీలుగా పంపకాలు జరిపారు. ప్రస్తుతం గ్రిడ్‌ డిమాండ్‌, ఇరిగేషన్‌ అవసరాల నిమిత్తం ఆంధ్రా రెండు వేల క్యూసెక్కులను, ఒడిశా 3 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకోవడానికి ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో ఒడిశా తరఫున పొట్టేరు ఇరిగేషన్‌ చీఫ్‌ కనస్ట్రక్షన్‌ ఇంజనీర్‌ కృపకుమార్‌ పాత్రో, చిత్రకొండ ఎర్త్‌ డ్యాం డివిజన్‌ ఎస్‌ఈ రమాకాంత పాత్ర, పొట్టేరు కెనాల్‌ డివిజన్‌ ఎస్‌ఈ సనోజ్‌ సాహూ, బలిమెల వోహెచ్‌పీసీ మేనేజర్‌ బిమల టర్కీ, డిప్యూటీ మేనేజర్‌ క్షుణిష్‌ చంద్రబెహరా, అసిస్టెంట్‌ మేనేజర్‌ సుబదీప్‌ పండా, ఎర్త్‌డ్యాం ఏఈఈలు దిలీప్‌కుమార్‌, కృష్ణచంద్ర ఫణి, గడాధర్‌ ప్రధాన్‌లు పాల్గొనగా, ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు సివిల్‌ వోఅండ్‌ఎం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ చిన్న కామేశ్వరరావు, ఈఈ ఎస్‌.జైపాల్‌, ఏఈఈ సీహెచ్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:23 AM