బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:24 PM
ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు బుధవారం ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా బలిమెలలోని బలిమెల హైడ్రో ప్రాజెక్టు సీనియర్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
బలిమెల, జోలాపుట్ జలాశయాల్లో నీటి నిల్వ 113.2928 టీఎంసీలు
ఆంధ్రా వాటా 64.5790, ఒడిశా వాటా 48.7138 టీఎంసీలుగా పంపకం
సీలేరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు బుధవారం ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా బలిమెలలోని బలిమెల హైడ్రో ప్రాజెక్టు సీనియర్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025- 2026 నీటి సంవత్సరంలో జూలై 2025 నుంచి సెప్టెంబరు 2025 వరకు ఆంధ్రా తన వాటాగా బలిమెల నుంచి 13.4779 టీఎంసీలను వినియోగించుకున్నట్టు, ఒడిశా 29.3432 టీఎంసీలను వినియోగించుకున్నట్టు ఇరు రాష్ర్టాల అధికారులు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం ఒడిశా.. ఆంధ్రా కంటే ఇప్పటి వరకు 15.8653 టీఎంసీలను అధికంగా వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం బలిమెలలో 74.9800 టీఎంసీలు, జోలాపుట్‌లో 30.3128 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, రెండు జలాశయాల్లో 105.2928 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఈ నెలాఖరు నాటికి బలిమెలకు 5 టీఎంసీలు, జోలాపుట్‌కు మరో 3 టీఎంసీలు నీటి నిల్వలు వచ్చి చేరతాయని ఇరు రాష్ర్టాల అధికారులు లెక్కలు కట్టారు. దీని ప్రకారం బలిమెల, జోలాపుట్ రెండు జలాశయాల్లో మొత్తంగా 113.2928 టీఎంసీల నీటి నిల్వలు ఈ నెలఖరు నాటికి చేరతాయని, ఇందులో ఆంధ్రా వాటాగా 64.5790 టీఎంసీలు గాను, ఒడిశా వాటాగా 48.7138 టీఎంసీలు గాను ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య పంపకాల ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం విద్యుదుత్పత్తి, ఇరిగేషన్ అవసరాల నేపథ్యంలో ఆంధ్రా తన వాటాగా 1,500 క్యూసెక్కులను, ఒడిశా తన వాటాగా 3,700 క్యూసెక్కుల నీటిని వినియోగించుకోవడానికి ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఏకగ్రీవంగా అంగీకారం కుదిరింది. ఈ సమావేశంలో ఒడిశా తరఫున బలిమెల సీనియర్ జనరల్ మేనేజర్ (యూనిట్ హెడ్) దిలీప్‌కుమార్ స్వైన్, బలిమెల టెక్నికల్ వింగ్ హెడ్ జనరల్ మేనేజర్ అక్షర్‌కుమార్ సాహు, బలిమెల జనరేషన్ డివిజన్ జనరల్ మేనేజర్ ఓంప్రకాష్ నాయక్, డిప్యూటీ జనరల్ మేనేజర్ క్షైనిష్ బెహరా, అసిస్టెంట్ మేనేజర్ సుభుదీప్ పాండా, పొట్టేరు చీఫ్ కనస్ట్రక్షన్ ఇంజనీర్ శివప్రసాద్ పాణిగ్రహి, ఎర్త్ డ్యాం ఎస్‌ఈ రమాకాంత పాత్రో, ఏఈఈలు దిలీప్‌కుమార్ , గడాధర్ ప్రధాన్, కేసి ఫణి పాల్గొనగా, ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.చంద్రశేఖర్ రెడ్డి, ఈఈ ఎల్‌వీవీ రత్నకుమార్, ఏఈఈ సీహెచ్ సురేష్‌కుమార్ పాల్గొన్నారు.