బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:16 PM
ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై గురువారం ఇరు రాష్ర్టాల అధికారులు ఒడిశా మల్కన్‌గిరి జిల్లా బలిమెలలో సమావేశమయ్యారు.

ఆంధ్ర, ఒడిశా అధికారుల భేటీ
సీలేరు, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై గురువారం ఇరు రాష్ర్టాల అధికారులు ఒడిశా మల్కన్‌గిరి జిల్లా బలిమెలలో సమావేశమయ్యారు. 2024- 2025 నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తమ వాటాగా ఎన్ని టీఎంసీలు వినియోగించుకుందో లెక్కలు కట్టారు. 2024 జూలై నుంచి 2025 మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రా తన వాటాగా 69.8369 టీఎంసీలను వినియోగించుకోగా, ఒడిశా తన వాటాగా 73.5147 టీఎంసీలను వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఆంధ్రా కంటే ఒడిశా 3.6778 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించినట్టు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం జోలాపుట్, బలిమెల జలాశయాల్లో 44.7730 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఆంధ్రా వాటాగా 24.2254 టీఎంసీలు, ఒడిశా వాటాగా 20.5476 టీఎంసీలుగా ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం విద్యుదుత్పత్తి, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం ఆంధ్రాకు 3 వేల క్యూసెక్కులు, ఒడిశాకు 3 వేల క్యూసెక్కుల నీటిని ఏప్రిల్ నెలాఖరు వరకు వినియోగించుకోవడానికి ఇరు రాష్ర్టాల అధికారులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా తరఫున బీహెచ్‌ఈపీ సీనియర్ జనరల్ మేనేజర్ దిలీప్‌కుమార్ స్వైన్, బీహెచ్‌ఈపీ టెక్నికల్ వింగ్ జనరల్ మేనేజర్ రాధామాదబ్, జనరల్ మేనేజర్ జ్యోతిర్మయిదాస్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఓంప్రకాశ్‌నాయక్, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్, పొట్టేరు ఇరిగేషన్ చీఫ్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్ పితాబాస్‌సేథి, సూపరింటెండెంట్ ఇంజనీర్ రమాకాంత పాత్ర, ఏఈఈ తుఫార్‌రంజన్ కుంటియా, ఈఈ గడాధర్ ప్రధాన్ పాల్గొనగా, ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈలు ఎం.శ్రీనివాసరెడ్డి, డీఈఈ కె.దుర్గా శ్రీనివాసరావు పాల్గొన్నారు.