డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:33 AM
మండలంలోని మాడగడలో నిర్వహిస్తున్న బలి ఉత్సవం ఆఖరి రోజు కార్యక్రమానికి ఈ నెల 5న హాజరవుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ అభిషేక్ గౌడ, ఎస్పీ అమిత్ బర్ధార్ బుధవారం వేర్వేరుగా పరిశీలించారు.
మాడగడ గ్రామం, పవిత్ర గెడ్డను పరిశీలించిన ఎస్పీ అమిత్ బర్ధార్
గ్రామాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్
అరకులోయ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాడగడలో నిర్వహిస్తున్న బలి ఉత్సవం ఆఖరి రోజు కార్యక్రమానికి ఈ నెల 5న హాజరవుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ అభిషేక్ గౌడ, ఎస్పీ అమిత్ బర్ధార్ బుధవారం వేర్వేరుగా పరిశీలించారు. తొలుత ఎస్పీ అమిత్ బర్ధార్ ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, స్థానిక సీఐ, ఎస్‌ఐలతో కలిసి మాడగడ గ్రామాన్ని, పవిత్ర గెడ్డను, పూజలు నిర్వహించే బలి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలతో ఎస్పీ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ గిరిజనుల సంప్రదాయం, ఆచార, వ్యవహారాలను గౌరవించి ఇక్కడికి వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గిరిజన సంప్రదాయం ప్రకారం స్వాగతం పలకాలని కోరారు. బోసుబెడ్డ గ్రామ సమీపంలో గిరిజనులతో రచ్చబండ కార్యక్రమం మాదిరిగా సమావేశం నిర్వహించనున్న స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. డిప్యూటీ సీఎం పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ మాడగడ గ్రామాన్ని సందర్శించారు. ముగింపు రోజున జరిగే పూజల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతగిరి ఘాట్‌లో భారీ వాహనాల రాకపోకలు నిషేధం
పాడేరు: ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు అనంతగిరి ఘాట్ మార్గంలో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్టు ఎస్‌పీ అమిత్‌బర్ధార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెల 5న అరకులోయ మండలం మాడగడ రాక నేపథ్యంలో ఘాట్‌లో రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఈ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ విషయాన్ని వాహనదారులు గుర్తించాలని, కేవలం భారీ వాహనాల రాకపోకలను మాత్రమే నిషేధించామని, ఇతర వాహనాలు యథాతథంగా తిరగవచ్చునని ఎస్‌పీ పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం అరకులోయ పర్యటన నేపథ్యంలో ప్రజలు.. పోలీసు యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరించాలని ఎస్‌పీ కోరారు.