Share News

రెవెన్యూకు త్వరలో సొంత గూడు

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:38 AM

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం సొంత భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. తొమ్మిది సంవత్సరాలుగా అసంపూర్తిగా వున్న ఈ భవనానికి.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కదలిక వచ్చింది. ప్రభుత్వం ఇటీవల రూ.1.2 కోట్లు మంజూరు చేయడంతో పనులు పునఃప్రారంభమయ్యాయి.

రెవెన్యూకు త్వరలో సొంత గూడు
నిర్మాణ పనులు పునఃప్రారంభమైన తహసీల్దారు కార్యాలయ భవనంం

రూ.1.2 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తహసీల్దారు కార్యాలయం భవన నిర్మాణ పనులు పునఃప్రారంభం

మూడు శాఖలకు తీరనున్న వసతి సమస్య

చోడవరం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం సొంత భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. తొమ్మిది సంవత్సరాలుగా అసంపూర్తిగా వున్న ఈ భవనానికి.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కదలిక వచ్చింది. ప్రభుత్వం ఇటీవల రూ.1.2 కోట్లు మంజూరు చేయడంతో పనులు పునఃప్రారంభమయ్యాయి.

అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో తహసీల్దార్‌ కార్యాలయానికి పదేళ్ల నుంచి సొంతగూడు కరువైంది. సుమారు 26 ఏళ్ల క్రితం పీపుల్‌ వార్‌ గ్రూపు నక్సలైట్లు (ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు పార్టీ) రెవెన్యూ కార్యాలయం భవనాన్ని బాంబులు పెట్టి పేల్చివేశారు. దీంతో భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. శిఽథిల భవనంలోనే కార్యాలయాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజన తరువాత 2016లో టీడీపీ అధికారంలో వున్నప్పుడు తహసీల్దార్‌ కార్యాలయానికి నూతన భవన నిర్మాణం కోసం రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్‌ నిధులు కేటాయించారు. పాత భవనాన్ని కూల్చివేసి, కొత్త భవనం నిర్మించడానికి తహసీల్దారు కార్యాలయాన్ని తాత్కాలికంగా స్త్రీశక్తి భవనంలోకి తరలించారు. అయితే భవన నిర్మాణానికి మంజూరైన నిధులు చాలకపోవడంతో అసంపూర్తిగా ఆగిపోయింది. ఇదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయం భవన నిర్మాణం పూర్తిచేయించడానికి ఐదేళ్ల కాలంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు.. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌లను చోడవరం పర్యటనకు తీసుకువచ్చి, తహసీల్దారు కార్యాలయానికి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఇటీవల ఒక కోటి 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. అధికారులు టెండర్లు పిలిచి భవన నిర్మాణ పనులను పునఃప్రారంభించారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే తహసీల్దారు కార్యాలయంతోపాటు సబ్‌ట్రెజరీ, వెలుగు కార్యాలయాలకు వసతి సమస్య తీరుతుంది.

Updated Date - Jul 19 , 2025 | 12:38 AM