రెవెన్యూలో పైసావసూల్
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:49 AM
జిల్లాలో రెవెన్యూలో అవినీతి మర్రి ఊడల్లా విస్తరిస్తోంది.. పలు తహశీల్దారు కార్యాలయాల్లో అవినీతికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు తహశీల్దారు కార్యాలయాలే అడ్డాగా చేసుకొని భూ లావాదేవీలు సాగించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ మార్పు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి పనికీ రేటు
కాసులు పడితేనే కదులుతున్న ఫైల్
మ్యుటేషన్‌కు రూ.పది వేలు
22ఏ నుంచి తొలగించాలంటే ఎకరాకు రూ.లక్ష
ఇదీ జిల్లాలో తహశీల్దారు కార్యాలయాల తీరు
ఏసీబీకి ఫిర్యాదులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రెవెన్యూలో అవినీతి మర్రి ఊడల్లా విస్తరిస్తోంది.. పలు తహశీల్దారు కార్యాలయాల్లో అవినీతికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు తహశీల్దారు కార్యాలయాలే అడ్డాగా చేసుకొని భూ లావాదేవీలు సాగించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ మార్పు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మండలాల్లో తహశీల్దారు కార్యాలయానికి భూ సమస్యల పరిష్కారం కోసం వెళ్లేవారిని కొందరు ఉద్యోగులు డబ్బుల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ప్రతి పనికి పైసలు చేతిలో పడితేనే ఫైలు ముందుకు కదులుతోంది. లేదంటే రకరకాల కొర్రీలు పెట్టి నెలల తరబడి మూలకు చేరుతున్నాయన్నది బహిరంగ రహస్యంగా మారిపోయింది. తాజాగా అనకాపల్లి కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న మారేడుపూడి, అక్కిరెడ్డిపాలెం పంచాయతీల వీఆర్‌ఓ సూర్యనారాయణ రైతు నుంచి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడడం రెవెన్యూలో కలకలం రేపుతోంది. మారేడుపూడి వీఆర్‌ఓ సూర్యనారాయణ అక్కిరెడ్డిపాలెంకు అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. తండ్రి నుంచి కుమారుడికి దఖలు పడాల్సిన మూడు ఎకరాల భూమికి పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకొంటూ అనకాపల్లి తహశీల్దారు కార్యాలయంలో ఏసీబీకి వీఆర్‌ఓ పట్టుబడ్డాడు. కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న మారేడుపూడి, అక్కిరెడ్డిపాలెం వీఆర్‌ఓ అనకాపల్లి తహశీల్దారు కార్యాలయానికి ఎందుకు వచ్చారనేది చర్చనీయాంశంగా మారిపోయింది. జిల్లాలో 24 తహశీల్దారు కార్యాలయాలు ఉండగా 522 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అన్ని మండలాలకు తహశీల్దార్లు ఉండగా 380 మంది వీఆర్‌ఓలు పనిచేస్తున్నారు. ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున మండల సర్వేయర్లు, డీటీలు, ఆర్‌ఐలు ఉన్నారు. వీఆర్‌ఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో కొన్ని మండలాల్లో ఒక వీఆర్‌ఓ రెండు మూడు పంచాయతీల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో ఏ చిన్న పని జరగాలన్నా వీఆర్‌ఓలు, మండల సర్వేయర్లే కీలకం. తహశీల్దారుకు అందిన ప్రతి అర్జీని వీఆర్‌ఓలు, సర్వేయర్లకు క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతారు. వీరి రిపోర్టు ఆధారంగానే తహశీల్దార్లు నిర్ణయాలు తీసుకుంటారు. ఇదే అదనుగా భావించి వీఆర్‌ఓలు, సర్వేయర్లు ఒక్కటై వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే రైతులు, భూ యజమానుల నుంచి అందినంత దండుకుంటున్నారు. వీరు వసూలు చేసే మొత్తంలో ఎవరి వాటాలు వారికి వెళతాయన్నది బహిరంగ రహస్యం. దీంతో క్షేత్రస్థాయిలో వీఆర్‌ఓలు, సర్వేయర్లు రిఫర్ చేసిన ఫైళ్లు వేగంగా కదులుతాయి. తహశీల్దారు కార్యాలయాలకు రైతులు, భూ యజమానులు వస్తుంటారు. వారసత్వ ఆస్తి తమ పేరున (మ్యుటేషన్), రెవెన్యూ రికార్డులు, పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ, రకరకాల ధ్రువపత్రాల జారీ కోసం ఎక్కువగా దరఖాస్తులు అందుతుంటాయి. వారసత్వంగా దఖలు పడిన భూమికి సంబంధించి మొత్తం భూమిని సబ్ డివిజన్ చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేయాల్సి ఉంటుంది. పంట పొలాలు ఒకరి నుంచి మరొకరికి బదలాయించే క్రమంలో సరిహద్దులు నిర్ణయించేందుకు రెవెన్యూ, సర్వే అధికారులకు అర్జీలు పెట్టుకుంటారు. ఎక్కువగా సంఖ్యలో వారసత్వ ఆస్తి మ్యుటేషన్ కోసం అర్జీలు అందుతుంటాయి. మ్యుటేషన్ చేయాలంటే తహశీల్దారు కార్యాలయ సిబ్బందికి ఎకరా భూమికి రూ.10 వేలు తక్కువ కాకుండా ముట్టజెప్పాల్సిందే. లేదంటే ఫైలు అడుగు కదలదు. అంతేకాకుండా సరైన రికార్డులు లేకపోయినా తమ ఆధీనంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూములను 22ఏ (ప్రభుత్వ రికార్డుల్లో) నమోదైన సందర్భంలో తొలగింపు కోరుతూ భూ యజమానులు మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటారు. ఎకరా భూమిని 22ఏ ప్రభుత్వ రికార్డు నుంచి తొలగించాలంటే లక్షకు తక్కువ కాకుండా దండుకుంటున్నారు. అనకాపల్లి, సబ్బవరం, కశింకోట, ఎలమంచిలి, అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపే మండలాల పరిధిలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న భూముల విషయంలో లంచం మరికొంత ఎక్కువ చెల్లించుకుంటేనే పని అవుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిని బట్టి రేటు నిర్ణయించి మరీ తహశీల్దారు కార్యాలయాల్లో సిబ్బంది దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో కొందరు వీఆర్‌ఓలు, సర్వేయర్లు రికార్డులు తారుమారు చేయడంలో ఆరితేరిపోయారు. తహశీల్దార్ల డిజిటల్ కీలను తమ ఆధీనంలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేస్తుంటారు. రికార్డుల తారుమారుకు భూ యజమానుల నుంచి ఽభారీగా దండుకున్న మొత్తంలో అందరికీ సమానంగా వాటాలు పంచుతుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలో తహశీల్దారు కార్యాలయాలు, వీఆర్‌ఓలు, సర్వేయర్ల అవినీతి చిట్టా ఏసీబీ అధికారుల వద్ద ఉందనే భయంతో వణుకుతున్నారు.
ఏసీబీ దాడులు జరుగుతున్నా....
అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పలువురు పట్టుబడుతున్నా, లంచాలకు అలవాటుపడిన ఉద్యోగులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. 2024లో కశింకోట మండలం నర్సింగబిల్లి రెవెన్యూ జట్టపురెడ్డి తుని వీఆర్‌ఓ గన్నమరాజు శ్రీసూర్యకృష్ణ పృథ్వి, ఓ రైతుకు వారసత్వంగా దఖలు పడిన భూమికి మ్యుటేషన్ చేసేందుకు రూ.20 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రోలుగుంట తహశీల్దారు కార్యాలయంలో 2023లో ఏసీబీ సోదాలు జరిగాయి. అప్పట్లో తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారు, వీఆర్‌ఓ అవినీతికి పాల్పడినట్టు నిర్థారణ కావడంతో విచారణ జరగుతోంది. 2021 జూన్ నెలలో చీడికాడ వీఆర్‌ఓ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇదే సంవత్సరంలో చోడవరంలో తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దార్లు రూ.5 లక్షలు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కారు. 2022 సంవత్సరంలో దేవరాపల్లి మండలంలోని అలమండ వీఆర్‌ఓ ఒక రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 2021లో నాతవరం మండలం పీకే గూడెం వీఆర్‌ఓ సత్యనారాయణ రూ.2 వేలు లంచం తీసుకొని ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇదే మండలంలో గుమ్మడిగండ వీఆర్‌ఓ సింహాచలం రూ.6 వేలు లంచం తీసుకొని పట్టుబడగా 2022లో ములగపూడి వీఆర్‌ఓ రూ.2 వేలు లంచం తీసుకొని పట్టుబడ్డాడు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతస్థాయి అధికారులు తహశీల్దారు కార్యాలయాల్లో సాగుతున్న అవినీతి వ్యవహారాలపై నిఘా పెట్టి చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.