బ్యాంకాక్, మలేషియా, కొలంబో విమానాలు పునరుద్ధరించండి
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:27 AM
విమానాశ్రయంలో ఇన్‌లైన్ బ్యాగేజీ చెకింగ్ ఆరు నెలలైనా ప్రారంభం కాకపోవడం, లగేజీని చెక్ చేసే స్కానర్లలో రెండూ తరచూ మొరాయించడం, ఇంకా మౌలిక వసతుల లోపాలపై విమానాశ్రయం సలహా కమిటీ అధ్యక్షులు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపైనా దృష్టి పెట్టండి
ఎయిర్‌పోర్టు అధికారులకు విమానాశ్రయం సలహా కమిటీ అధ్యక్షులు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ సూచన
బ్యాగేజీ స్కానర్లు తరచూ మొరాయింపు అసంతప్తి
ఇంటర్నేషనల్ కార్గో చేయలేమని చేతులెత్తేసిన సంస్థ
విశాఖపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
విమానాశ్రయంలో ఇన్‌లైన్ బ్యాగేజీ చెకింగ్ ఆరు నెలలైనా ప్రారంభం కాకపోవడం, లగేజీని చెక్ చేసే స్కానర్లలో రెండూ తరచూ మొరాయించడం, ఇంకా మౌలిక వసతుల లోపాలపై విమానాశ్రయం సలహా కమిటీ అధ్యక్షులు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇన్‌చార్జి డైరెక్టర్ పురుషోత్తం, ప్రభుత్వ విప్ గణబాబు, నేవీ అధికారులు, సలహా కమిటీ సభ్యులతో ఆయన విమానాశ్రయంలో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడాది నుంచి అంతర్జాతీయ కార్గో ప్రారంభించాలని సూచిస్తున్నా, ఎందుకు చేయడం లేదని ఎంపీ ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్లే సరకును అంచనా వేయగా అంత పొటెన్షియాలిటీ లేదని తేలిందని ఏజెన్సీ ప్రతినిధి చెప్పారు. ప్రయాణికుల బ్యాగేజీలను స్కాన్ చేసే ఎక్స్‌రే యంత్రాలు నాలుగు ఉండగా వాటిలో రెండు నిత్యం మొరాయిస్తున్నాయని పలువురు ఆరోపించగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని విమానాశ్రయం అధికారులు హామీ ఇచ్చారు. గోవా, పుణేలకు 85 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న విమానాలను ఆపేశారని, వాటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారని ఎంపీ ప్రశ్నించగా...ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు. ప్రయాణికులకు తక్కువ ధరకు ఆహార పదార్థాలు అందించడానికి ఉడాన్ యాత్రీ కేఫ్‌ను విశాఖ ఎయిర్‌పోర్టులో కూడా ప్రారంభించాలని ఎంపీ సూచించారు. నేరుగా విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాలపై దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకాక్, మలేషియా, కొలంబో విమానాలను పునరుద్ధరించాలన్నారు. వాష్ రూమ్‌ల నిర్వహణ సరిగ్గా ఉండడం లేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అదనపు స్లాట్లు కేటాయించాలని నేవీ అధికారులను కోరగా, పైలట్లకు శిక్షణ ఇస్తున్నామని, ప్రస్తుతం కేటాయించలేమని స్పష్టంచేశారు.
శ్రీవాణి-తిరుపతి విమానంపై చర్చ
విశాఖ నుంచి తిరుపతి వెళ్లే విమాన ప్రయాణికులకు శ్రీవాణి టికెట్లు లభించడం లేదని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై సమావేశంలో చర్చ జరిగింది. కమిటీ సభ్యులు ఒ.నరేశ్‌కుమార్ మాట్లాడుతూ, ఉదయం 8 గంటలకల్లా తిరుపతికి విమానం వెళ్లేలా సమయాలు మార్చాలని కోరారు. దీనిపై ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, అటు నుంచి విమానాన్ని మధ్యాహ్నం కాకుండా సాయంత్రం వీలైనంత ఆలస్యంగా నడపాలని సూచించారు.