Share News

కేజీహెచ్‌కు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:22 AM

ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి 12 గంటల గంటల ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు.

కేజీహెచ్‌కు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

గురువారం రాత్రి 12 గంటల సమయంలో కొలిక్కివచ్చిన సమస్య

ఊపిరి పీల్చుకున్న రోగులు

ఆస్పత్రి అధికారుల మధ్య సమన్వయలోపంతోనే సమస్య పరిష్కారంలో జాప్యం

ఉన్నతాధికారులు తలంటిన తరువాత గానీ ఈపీడీసీఎల్‌కు సమాచారం

విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి 12 గంటల గంటల ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. మధ్యాహ్నం రెండు గంటలకు మార్చురీ ఎదురుగా గల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ వద్ద ర్యాంప్‌ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన కేబుల్స్‌ తెగిపోయాయి. దీంతో ఆస్పత్రిలోని భావనగర్‌, రాజేంద్రప్రసాద్‌, పీడియాట్రిక్‌, ఆర్థో, గైనిక్‌ విభాగాలతోపాటు సీఎస్‌ఆర్‌ బ్లాక్‌కు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. సాయంత్రం ఏడు గంటలకు రోగులు పడుతున్న ఇబ్బందులను పలువురు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో క్షణాల్లోనే రాష్ట్రస్థాయిలో సంచలనంగా మారింది. దీంతో ఆరోగ్యశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ఆస్పత్రి అధికారులు వెంటనే సమస్యను ఏపీఈపీడీసీఎల్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈపీడీసీఎల్‌ సిబ్బంది, ఆస్పత్రికి చెందిన ఎలక్ర్టికల్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ సిబ్బంది కలిసి విద్యుత్‌ పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. కొన్ని గంటలపాటు శ్రమించి రాత్రి 12 గంటలు సమయానికి వార్డులకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. దీంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటివరకూ వార్డులు బయట, చెట్ల కింద విశ్రాంతి తీసుకున్న రోగులు వార్డుల్లోకి వెళ్లారు.

తప్పిన పెను ప్రమాదం..

కేజీహెచ్‌లో ప్రతిరోజూ ఇన్‌పేషెంట్లుగా సుమారు 1,500 మంది వైద్య సేవలు పొందుతుంటారు. అందులో సుమారు 500 మంది వరకూ అత్యవసర సేవలు పొందుతుంటారు. వీరికి ఆక్సిజన్‌ అందించాలంటే తప్పనిసరిగా విద్యుత్‌ సరఫరా ఉండాలి. గురువారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అత్యవసర విభాగాలకు విద్యుత్‌ అందించేందుకు అనుగుణంగా ఉన్న ఐదు జనరేటర్లను వినియోగించారు.

సమన్వయ లోపమే కారణమా.?

సాధారణంగా కేజీహెచ్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడం అన్నది అరుదుగా జరుగుతుంది. ఎప్పుడైనా సమస్య తలెత్తినా నిమిషాల్లోనే పరిష్కరిస్తుంటారు. అయితే, గురువారం సమస్యను అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని చెబుతున్నారు. ఆస్పత్రి ఉన్నతాధికారి నగరంలో లేరు. ఆమె లేనప్పుడు ఆస్పత్రిలో వ్యవహారాలను చూసుకోవాల్సిన ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరించడం వల్లే రోగులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందంటున్నారు. ఈ సమస్యకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారిన తరువాత ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తలంటిన తరువాతే ఏపీఈపీడీసీఎల్‌ అధికారులకు ఆస్పత్రి అధికారులకు సమాచారాన్ని అందించినట్టు చెబుతున్నారు. అప్పటివరకూ ఆస్పత్రిలో ఉన్న ఎలక్ర్టికల్‌ సిబ్బందితోనే సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేశారు. అదే సమస్య ఉత్పన్నమైన వెంటనే ఆస్పత్రి అధికారులు విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఉంటే సాయంత్రానికి పరిష్కారమయ్యేదని చెబుతున్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణిని వివరణ కోరగా తాను కోర్టు పనులు నిమిత్తం విజయవాడ వెళ్లానన్నారు. అయినప్పటికీ సమస్య తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. నేరుగా విజయవాడ నుంచి ఆస్పత్రికే వచ్చి పనులను పర్యవేక్షించానని, అప్పటికే డిప్యూటీ సూపరింటెండెంట్లు, అడ్మినిస్ర్టేటర్‌, ఇతర అధికారులు పనులు జరుగుతున్న ప్రాంతంలోనే ఉన్నారన్నారు. ఇదిలావుండగా ఆస్పత్రిలో నిర్వహణ పనుల కారణంగా తలెత్తిన సమస్యను సిబ్బందితో కలిసి పరిష్కరించి రాత్రి 11.45 గంటలు సమయంలో సరఫరా పునరుద్ధరించామని ఏపీఈపీడీసీఎల్‌ విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈ జి.శ్యాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Nov 08 , 2025 | 01:22 AM