వర్షంతో ఊరట
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:30 AM
జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి జనం ఉపశమనం పొందారు. పలు చోట్ల ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా, సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
- ఉదయం నుంచి ఎండ
- సాయంత్రం భారీ వర్షం
అనకాపల్లి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి/న్యూస్ నెట్‌వర్క్): జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి జనం ఉపశమనం పొందారు. పలు చోట్ల ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా, సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. చోడవరం, బుచ్చెయ్యపేట, కృష్ణాదేవిపేట, మాడుగుల మండలాల్లో సాయంత్రం కొద్దిసేపు ఒక మోస్తరు వర్షం పడింది. మునగపాక మండలంలో ఈదురు గాలులతో కూడిన వాన కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అనకాపల్లి, సబ్బవరం, కశింకోట, ఎలమంచిలి, కోటవురట్ల, రావికమతం, ఎస్.రాయవరం మండలాల్లో వాతావరణం చల్లబడి తేలికపాటి జల్లులు కురిశాయి. చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, రావికమతంలో రాత్రి ఏడు గంటల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. గత రెండు, మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉక్కబోతతో విలవిలలాడిన జనం శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో సేద తీరారు.
అనకాపల్లి పట్టణంలో..
అనకాపల్లి టౌన్: అనకాపల్లి పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4.30 గంటలకు దట్టంగా మేఘాలు అలుముకుని ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. చీకటి వాతావరణం నెలకొనడంతో హెడ్ లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగించాయి. సుమారు 20 నిమిషాల పాటు వర్షం పడడంతో రహదారులు జలమయమయ్యాయి. విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద వర్షపునీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో వర్షపునీరు నిలిచిపోవడంతో కాంప్లెక్స్‌లోకి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.