వర్షంతో ఊరట
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:42 AM
జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ మండిపోయింది. తరువాత వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది.
పలు మండలాల్లో కుండపోతగా కురిసిన వాన
అనకాపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్): జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ మండిపోయింది. తరువాత వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలులతో వర్షం మొదలైది. కోటవురట్ల, పాయకరావుపేట, దేవరాపల్లి, గొలుగొండ మండలాలు, అనకాపల్లి పట్టణంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, పొలాల్లో నీరు నిలిచింది. కాగా అనకాపల్లి, మాకవరపాలెం, నర్సీపట్నం, చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. సబ్బవరం, ఎలమంచిలి, పరవాడ, మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊరట చెందారు. వరినారుమళ్లకు, మెట్ట పంటలకు వర్షం ఉపకరిస్తుందని రైతులు చెబుతున్నారు.
రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు
అనకాపల్లి అగ్రికల్చర్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాగల ఐదు రోజుల్లో ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ముకుందరావు తెలిపారు. మంగళవారం ఇక్కడ శాస్త్రవేత్తలతో జరిగిన వాతావరణ ఆధారిత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరి నారుమళ్లకు తామర పురుగు, పొడ పురుగు, గోధుమ రంగు మచ్చ తెగులు ఆశించే అవకాశం వుందని చెప్పారు. వీటి నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, కార్బెండిజిం ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. వరినాట్లు వేసేటప్పుడు నారు ఆకు చివర్లను తుంచి, వరుసల మధ్య 20 సెంటీమీటర్ల, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం వుండేలా కుదురుకు 2-3 మొక్కలు నాటుకోవాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మొక్కజొన్న పంటను ఎండు తెగులు ఆశించే అవకాశం ఉన్నదని, ఉధృతినిబట్టి లీటరు నీటికి 2.5 గ్రాముల చొప్పున మాంకోజేబ్‌ను కలిపి ఒకటి లేదా రెండుసార్లు పిచికారీ చేయాలన్నారు. తొలి పూత దశలో ఉన్న వేరుశనగ పైరులో ఎకరాకు 200 కిలోల జిప్సం వేయాలని సూచించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు కె.వి.రమణమూర్తి, వి.గౌరి, ఆర్.సరిత, రామలక్ష్మి, పద్మావతి, అలివేణి పాల్గొన్నారు.
పిడుగుపడి రైతు మృతి
నాతవరం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడడంతో రైతు మృతిచెందాడు. నాతవరం గ్రామానికి చెందిన గవిరెడ్డి పెద్దినాయుడు (55) పొలంలో మంగళవారం వరినాట్లు వేస్తున్నారు. మహిళా కూలీలకు వరి కట్టలు అందిస్తుండగా ఆయనకు అతిసమీపంలో పిడుగుపడింది. దీంతో అక్కడక్కడే మృతిచెందాడు. ఇతనికి భార్య, కుమారుడు వున్నారు.