వర్షంతో ఊరట
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:58 AM
జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికం
- ఆ తరువాత మోస్తరు వర్షం
- చల్లబడిన వాతావరణం
అనకాపల్లి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
రావికమతం మండలంలో మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. మాడుగుల మండలంలో కూడా మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, సాయంత్రం తేలికపాటి జల్లులు పడ్డాయి. గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. నక్కపల్లి మండలంలో సాయంత్రం 4 గంటలకు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతకు అల్లాడిన జనం వర్షంతో ఊరట చెందారు. అచ్యుతాపురం మండలంలో కూడా సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. నర్సీపట్నం, చోడవరం, ఎస్.రాయవరం, సబ్బవరం, మాకవరపాలెం, పాయకరావుపేట, కశింకోట మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం వాతావరణం చల్లబడి, పలుచోట్ల వర్షాలు కురవడంతో జిల్లా ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.
అనకాపల్లిలో ఈదురుగాలులు
అనకాపల్లి టౌన్: అనకాపల్లిలో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. మధ్యాహ్నం వరకు 36.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతతో ఉన్న వాతావరణం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా కారుమేఘాలు కమ్ముకున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సుమారు 45 నిమిషాల పాటు ఈదురుగాలులతో వర్షం కురియడంతో అప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతతో ఇబ్బందులు పడ్డ జనం ఉపశమనం పొందారు. కారణంగా రహదారుల్లో ఎక్కడపడితే అక్కడ వర్షపునీరు నిలిచిపోయింది. రోడ్డుకు పల్లంగా ఉన్న ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాదచారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ చెరువును తలపించేలా వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో డిపోలోకి వెళ్లి వచ్చే కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అలాగే విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద వర్షపునీరు నిలిచిపోవడంతో అనకాపల్లి - చోడవరం మార్గాల మధ్య రాకపోకలు సాగించే వాహనచోదకులు అవస్థలు పడ్డారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది.