ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కారం
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:56 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో స్వీకరించిన అర్జీలను ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ అన్నారు.
జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ
మీకోసంలో 119 వినతులు స్వీకరణ
పాడేరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో స్వీకరించిన అర్జీలను ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అధికారులు తమ సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు వినతులు సమర్పిస్తారని, అందుకు తగ్గట్టుగానే అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు పదే పదే అర్జీలు సమర్పించే అవసరం లేకుండా ఆయా సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల నుంచి 119 వినతులను స్వీకరించారు. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ నక్కమెట్ట గ్రామానికి చెందిన వంతాల త్రినాథ్, పోతురాజు, గుమ్మాలు గ్రామానికి చెందిన మర్రి సాంబశివమూర్తి, తదితరులు తాము మినీ గోకులాలను నిర్మించుకున్నామని, కాని బిల్లులు మంజూరు కాలేదని తెలపగా, హుకుంపేట మండలం కొంతెలి గ్రామానికి చెందిన ఎ.సత్యవతి, తన 80 సెంట్‌ల భూమిని పలువురు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ డెక్కపారు గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరారు. హుకుంపేట మండలం బి.బొడ్డాపుట్టు పంచాయతీ దబ్బగరువు వి.రాజులమ్మ, తన భర్త 2021లో మృతి చెందినా నేటికీ వితంతు పెన్షన్ రాలేని తెలిపింది. అలాగే జి.మాడుగుల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంతాల మచ్చమ్మ ఇల్లు నిర్మాణం చేసుకున్నా బిల్లులు చెల్లించడం లేదని తెలపగా, తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని హుకుంపేట మండలం మర్రిపుట్టు చెందిన దివ్యాంగురాలు సీహెచ్.కాంతమ్మ వినతిపత్రం సమర్పించారు.
1100 మీకోసం కాల్ సెంటర్ సేవలు పొందాలి
మీకోసంలో అర్జీదారుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ సూచించారు. అర్జీదారులు కాల్‌సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో కె.పద్మలత, గిరిజన సంక్షేమ శాఖ ఎస్‌డీసీ ఎంవీఎస్.లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఈవో పి.బ్రహ్మాజీరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్ , ల్యాండ్ సర్వే విభాగం ఏడీ దేవేంద్రుడు, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్ వి.ధర్మరాజు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ఖజానాధికారి ప్రసాద్‌బాబు, ఎస్‌టీవో కృపారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.