జలాశయాలు కళకళ
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:58 AM
గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో రిజర్వాయర్లలో భారీగా నీరు చేరుతోంది.
రిజర్వాయర్లలో ప్రస్తుత నీటిమట్టాలు
రిజర్వాయర్ గరిష్ఠం కనిష్ఠం ప్రస్తుతం
ఏలేరు 86.56 మీటర్లు 68.8 మీటర్లు 81.16 మీటర్లు
రైవాడ 114 మీటర్లు 99 మీటర్లు 113.6 మీటర్లు
మేహాద్రిగెడ్డ 61 అడుగులు 44 అడుగులు 59.6 అడుగులు
తాటిపూడి 297 అడుగులు 151 అడుగులు 293.5 అడుగులు
ముడసర్లోవ 169 అడుగులు 152 అడుగులు 159.05 అడుగులు
గంభీరం 126 అడుగులు 117 అడుగులు 123 అడుగులు
-------------------------------
నిండుకుండల్లా రిజర్వాయర్లు
ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా చేరిన నీరు
దాదాపు అన్ని రిజర్వాయర్లలోనూ గరిష్ఠ స్థాయికి సమీపంలో నీటిమట్టాలు
ఏడాదిపాటు నగరంలో నీటి సరఫరాకు ఇబ్బందిలేనట్టే
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో రిజర్వాయర్లలో భారీగా నీరు చేరుతోంది. దాదాపు అన్ని రిజర్వాయర్లు గరిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి. రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు చేరడంతో మరో ఏడాది వరకూ నగరానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని జీవీఎంసీ అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
నగరవాసుల అవసరాల కోసం జీవీఎంసీ ప్రతిరోజూ 79 ఎండీజీల నీటిని సరఫరా చేస్తోంది. అందులో 42 ఎంజీడీలు ఏలేరు రిజర్వాయర్ నుంచి, పది ఎంజీడీలు తాటిపూడి రిజర్వాయర్ నుంచి, 15 ఎంజీడీలు రైవాడ రిజర్వాయర్ నుంచి, ఎనిమిది ఎంజీడీలు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ నుంచి, 0.5 ఎంజీడీలు చొప్పున ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్ల నుంచి సేకరిస్తోంది. ఏలేరు రిజర్వాయర్‌తోపాటు తాటిపూడి, రైవాడ రిజర్వాయర్‌ల నుంచి సాగు అవసరాలకు కూడా నీటిని విడుదల చేయాల్సి ఉంటోంది. వేసవిలో రిజర్వాయర్‌లలో నీటిమట్టం అడుగంటినప్పటికీ సాగు అవసరాలకు మాత్రం ఇస్తుంటారు. దీంతో మార్చి నుంచి రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతుంటాయి. ఆ ప్రభావం నగరంలో నీటి సరఫరాపై పడుతోంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు నగరంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయడం, కొళాయిల ద్వారా నీటిని ఇచ్చే వ్యవధిని తగ్గించడం చేస్తుంటారు. ఇక, ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంతో రిజర్వాయర్లలో నీరు చేరలేదు. పైగా ఆగస్టు రెండో వారం వరకూ వేసవిని తలపించేలా ఎండలు ఉన్నాయి. మరోవైపు రిజర్వాయర్ల నుంచి నీటిని వ్యవసాయం కోసం ఎక్కువగా విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో ఏలేరు, రైవాడ, తాటిపూడి రిజర్వాయర్లలో నీటి మట్టాలు కనిష్ఠ స్థాయికి చేరువయ్యాయి. ఇలాంటి తరుణంలో గత పది రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో రిజర్వాయర్లలో వర్షం నీరు భారీగా చేరింది. ఏలేరు రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం 81.16 మీటర్లు ఉంది. రైవాడ రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 113.6 మీటర్లకు చేరింది. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 59.6 అడుగులకు చేరింది. తాటిపూడి రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 293.5 అడుగులకు, ముడసర్లోవ రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి 169 అడుగులు కాగా ప్రస్తుతం 159.05 అడుగులకు, గంభీరం రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 126 అడుగులు కాగా ప్రస్తుతం 123 అడుగుల మేర నీరు చేరింది. సెప్టెంబరు నెలలో కూడా మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రిజర్వాయర్లలో నీటిమట్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.